AP Anganwadis: సమ్మె విరమించిన ఏపీ అంగన్వాడీలు.. ప్రభుత్వంతో చర్చలు సఫలం

AP Anganwadis have called off their strike as Talks with the government successful
  • జీతం పెంపు డిమాండ్‌ను జులైలో నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గిన అంగన్వాడీలు
  • అంగన్వాడీ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపిన మంత్రి బొత్స సత్యనారాయణ
  • చర్చలు సఫలమవ్వడంతో మంగళవారం నుంచి యథావిధిగా విధులకు హాజరుకానున్న అంగన్వాడీలు
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలు సమ్మె విరమించారు. జీతం పెంపు డిమాండ్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, జులైలో నెరవేర్చుతామంటూ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కి తగ్గారు. ఈ మేరకు సోమవారం అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, సమ్మె విరమిస్తున్నట్లు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. జులైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తక్షణమే విధుల్లోకి చేరుతున్నట్టు సంఘం ప్రతినిధులు తెలిపారు. దీంతో మంగళవారం నుంచి అంగన్వాడీలు యథావిధిగా విధులను కొనసాగించనున్నారు.

అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ కీలకమైన చర్చలు చేపట్టారు. వేతనాలు పెంచాలనే డిమాండ్‌ను జులైలో నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్టు మంత్రి బొత్స వెల్లడించారు. దీంతో సమ్మె విరమణకు అంగీకరించారని తెలిపారు. రెండు దఫాలు చర్చలు జరిగాయని, అంగన్వాడీలపై నమోదైన కేసులను సీఎం జగన్‌తో చర్చించి ఎత్తివేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అంగన్వాడీ టీచర్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ను రూ.1.20 లక్షలకు, హెల్పర్‌కు రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ను రూ.60 వేలకు పెంచామని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. సమ్మె కాలంపై ఏం చేయాలనే దానిపై సీఎంతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామని బొత్స తెలిపారు. రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లుగా నిర్ణయించామని, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా మార్చనున్నామని చెప్పారు.  

చాలా జిల్లాల్లో అంగన్వాడీలు విధులకు హాజరవుతున్నారని, మిగతా సిబ్బంది కూడా విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. అంగన్వాడీల ఆందోళన సమయంలో చాలా డిమాండ్లను నెరవేర్చేందుకు హామీ ఇచ్చామని, మిగిలిన వాటిపట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. తమ ముందు 11 డిమాండ్‌లు పెట్టగా వాటిలో పదింటిని నెరవేర్చేందుకు అంగీకరించామన్నారు.  సమ్మె విరమించిన అంగన్వాడీలకు బొత్స ధన్యవాదాలు తెలిపారు.
AP Anganwadis
Anganwadis
Andhra Pradesh
Botsa Satyanarayana

More Telugu News