K Kavitha: మంత్రి గారూ! ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారు?: పొన్నంకు కవిత కౌంటర్

MLA Kavitha asks minister ponnam about jyothirao pule statue
  • అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా? అని ప్రశ్న
  • ఉమ్మడి ఏపీలోనే జాగృతి సంస్థ ద్వారా అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయించినట్లు వెల్లడి
  • భవిష్యత్తులో రాజకీయాల కోసం సంకుచిత మనస్తత్వంతో మహాకార్యాన్ని అవహేళన చేస్తున్నారని విమర్శ
మంత్రి గారూ!  అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా? అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కవిత ఆధ్వర్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ వినతి పత్రం ఇచ్చింది. అయితే మీరు అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లు ఇది గుర్తుకు రాలేదా? అంటూ పొన్నం ట్వీట్ చేశారు. దీనికి కవిత కౌంటర్ ఇచ్చారు.

"మంత్రి గారూ! 
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారు? భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా??

అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా ?
స్ఫూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాం.
ఇప్పుడు కూడా అసెంబ్లీ ఆవరణలో పూలే గారి విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తాం.
భవిష్యత్తులో రాజకీయాల కోసం, సంకుచిత మనస్తత్వంతో, ఈ మహా కార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నాను.

మహాత్మా జ్యోతిరావు పూలే మహోన్నతుడు, అణగారిన ప్రజల్లో చైతన్యం నింపిన మహా మనిషి! అందుకే ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరుపునే కాకుండా యావత్‌ తెలంగాణ ప్రజల తరుపున వినమ్రంగా మరోసారి కోరుతున్నాను." అని ట్వీట్ చేశారు.
K Kavitha
Ponnam Prabhakar
Congress
BRS

More Telugu News