Arun Yogiraj: అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారి స్పందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్

  • ప్రస్తుతం ఈ భూమిపై తానే అత్యంత అదృష్టవంతుడినన్న శిల్పి
  • అంతా కల మాదిరిగా అనిపిస్తోందని వ్యాఖ్య
  • పూర్వీకులు, శ్రీరాముడి ఆశీర్వాదాలు ఎల్పప్పుడూ ఉంటాయని ఆనందం వ్యక్తం చేసిన అరుణ్ యోగిరాజ్
Sculptor Arun Yogiraj responded after the Lord Rama pran Prathista in Ayodhya

అయోధ్యలో అత్యంత వైభవోపేతంగా, కమనీయంగా జరిగిన బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువు తర్వాత విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తొలిసారి స్పందించారు. రాముడి విగ్రహాన్ని చెక్కిన తాను ప్రస్తుతం ఈ భూమిపై అత్యంత అదృష్టవంతుడినని భావిస్తున్నానని ఆయన అమితానందం వ్యక్తం చేశారు. ఇదంతా కల మాదిరిగా అనిపిస్తోందని అన్నారు. "నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, ఆ భగవంతుడు శ్రీరాముడి ఆశీర్వచనాలు నాకు ఎప్పటికీ ఉంటాయి. కొన్నిసార్లు నేను కలల ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది’’ అని యోగిరాజ్ అన్నారు. అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రామ్ లల్లా విగ్రహం కళ్లను కప్పి ఉంచిన వస్త్రాన్ని తొలగించిన అనంతరం శిల్పి అరుణ్ యోగిరాజ్ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు.

కాగా కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ గతంలో ఎన్నో దేవాలయాల కోసం ఎన్నో విగ్రహాలను రూపొందించినప్పటికీ రామ్ లల్లా విగ్రహం కోసం యావత్ దేశం ఎదురుచూసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ వేయి కళ్లతో ఎదురుచూశారు. దీంతో ఇలాంటి అనుభూతి ఎప్పుడూ పొందలేదని యోగిరాజ్ చెప్పాడు. కాగా నల్లరాతితో యోగిరాజ్ రూపొందించిన ఈ 51 అంగుళాల విగ్రహాన్ని అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. రామ్ లల్లా విగ్రహాన్ని గత వారమే ఆలయం గర్భ గుడిలో పెట్టినప్పటికీ ఈ రోజే పూర్తి రూపం దర్శనమిచ్చింది. కాగా  అరుణ్ యోగిరాజ్ తన కుటుంబంలో ఐదవ తరం శిల్పి కావడం విశేషం.

More Telugu News