Narendra Modi: ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు: ప్రధాని మోదీ

  • అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
  • ఉద్వేగభరితంగా సాగిన ప్రధాని మోదీ ప్రసంగం
  • ఇకపై మన బాలరాముడు మందిరంలో ఉంటాడని వెల్లడి
  • ఎన్నో త్యాగాలతో మన రాముడు మళ్లీ వచ్చాడని ఉద్ఘాటన
  • త్యాగధనుల ఆత్మలు ఇవాళ శాంతిస్తాయని వివరణ
Modi speech at Ayodhya Ram Mandir

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో యావత్ భారతదేశం పులకించిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఎన్నో బలిదానాలు, ఎన్నో త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ వచ్చాడని తెలిపారు. ఇప్పుడు వారి ఆత్మలన్నీ శాంతిస్తాయని అన్నారు. 

ఈ క్షణాన రామభక్తులంతా ఆనంద పారవశ్యంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ శుభ ఘడియల్లో ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. 

అయోధ్య రామ మందిరం గర్భగుడిలో ఇప్పుడే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించామని, ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదని అన్నారు. రామ్ లల్లా ఇక నుంచి మందిరంలో ఉంటాడని పేర్కొన్నారు. 

2024 జనవరి 22... ఇది సాధారణ తేదీ కాదని, కొత్త కాలచక్రానికి ప్రతీక అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రాముడు నాడు ధనుష్కోడిని దాటినప్పుడు కాలచక్రం మారింది, మళ్లీ ఇప్పుడు మారిందని వివరించారు. అయితే, ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించాలని రాముడ్ని వేడుకుంటున్నానని వెల్లడించారు.

ఈ క్షణం కోసం అయోధ్య ప్రజానీకం వందల ఏళ్లు నిరీక్షించిందని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయపోరాటం సాగించామని వివరించారు. 500 ఏళ్లలో ఆలయ నిర్మాణం ఎందుకు సాధ్యం కాలేదో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. 

"రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. కానీ అయోధ్య వాసులు 5 శతాబ్దాలుగా ఈ క్షణం కోసం వేచిచూస్తున్నారు. భారత న్యాయవ్యవస్థ వారి స్వప్నాన్ని సాకారం చేసింది. ఈ క్షణం దేశ ప్రజల సహనానికి, పరిపక్వతకు నిదర్శనం. అత్యున్నతమైన ఆదర్శ వ్యక్తికి నేడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. రాజ్యాంగబద్ధంగానే రామాలయం నిర్మించాం. 

దేశమంతా ఈ రోజు దీపావళి జరుపుకోవాలి. దేశంలోని ప్రతి ఇంట్లో ఇవాళ రాముడి పేరిట దీపాలు వెలగాలి. భారతదేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలం. రాముడు అనుసరించిన ఆదర్శం, క్రమశిక్షణ, విలువలు మనకు పునాదులు, అవే మనకు శిరోధార్యం. 

వసుధైక కుటుంబం అనేది మన జీవన విధానం. కానీ కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారు. రాముడే భారత్ కు ఆధారం... రాముడే భారత్ విధానం... నేడు జరిగింది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మాత్రమే కాదు... భారతీయ విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్ఠ" అంటూ ప్రధాని మోదీ వివరించారు.

More Telugu News