Anganwadis: అంగన్వాడీలను తొలగించాలంటూ ఏపీ సర్కారు ఆదేశాలు

AP Government Order To District Collectors Over Removal Non Performing Anganwadis
  • ఎస్మా నోటీసుల గడువు తీరడంతో కలెక్టర్లకు సూచన
  • ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్న కలెక్టర్లు
  • ఈ నెల 25న నియామక ప్రకటన విడుదల చేయనున్న ప్రభుత్వం
వేతన పెంపు, ఉద్యోగ భద్రత.. తదితర డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర జేసింది. ఇప్పటికే ఎస్మా చట్టం కింద చేర్చుతూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఎస్మా చట్టం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ విధుల్లో చేరకపోవడంపై సీరియస్ అయింది. నోటీసుల గడువు పూర్తికావడంతో ఇప్పటికీ విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలంటూ కలెక్టర్లకు సూచించింది.

ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను విధుల నుంచి తొలగించేందుకు కలెక్టర్లు చర్యలు చేపడుతున్నారు. అంగన్వాడీలకు టర్మినేషన్ లెటర్లు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తీసేసిన అంగన్వాడీల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 25న కొత్త నియామక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టారు. కాగా, సమ్మెలో పాల్గొంటూ విధులకు హాజరుకాని కార్యకర్తలు మొత్తం 1444 మంది, ఆయాలు 931 మంది ఉన్నారని పార్వతీపురం మన్యం జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి ఎం.ఎన్.రాణి తెలిపారు. విజయనగరం జిల్లా పరిధిలో 4151 మంది అంగన్వాడీ సిబ్బంది సమ్మెలో పాల్గొనగా.. సోమవారం వరకు 503 మంది తిరిగి విధుల్లో చేరారని కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. ఇప్పటికీ విధులకు హాజరుకాని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వివరించారు.
Anganwadis
Job Termination
Removal
Ap Govt
Collectors
Vizianagaram
Andhra Pradesh

More Telugu News