Chiranjeevi: హనుమంతుడే అయోధ్యకు ఆహ్వానించినట్టు భావిస్తున్నా: చిరంజీవి

  • ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొననున్న చిరంజీవి 
  • తన ఇష్టదైవం హనుమంతుడే ఆహ్వానించినట్టుగా ఉందని వ్యాఖ్య
  • ఇవి జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలన్న మెగాస్టార్
Ayodhya Ram Temple pranpratishtha ceremony Chiranjeevi shares his feelings with ANI

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం రావడంపై ప్రముుఖ సినీ నటుడు చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలిపారు. తన ఇష్టదైవం హనుమంతుడే ఈ ఆహ్వానం పంపినట్టు భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమమని, తనకు ఈ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయని వ్యాఖ్యానించారు. ఇదంతా ఆ భగవంతుడి ఆశీర్వాదమని అన్నారు. 

రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయోధ్యకు వెళ్లారు. 500 ఏళ్ల ఎదురుచూపుల తరువాత ఈ కల సాకారమవుతోందని పవన్ వ్యాఖ్యానించారు. నేటి మధ్యాహ్నం 12.20 గంటలకు జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచీ 7 వేల మంది ప్రముఖులు హాజరవుతున్నారు. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ క్రతువులో పాలుపంచుకుంటారు.

More Telugu News