Team India: హైదరాబాద్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఘన స్వాగతం.. వీడియో ఇదిగో!

  • భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్
  • 25న ఉప్పల్‌లో తొలిటెస్టు ప్రారంభం
  • రెండో టెస్టుకు ఆతిథ్యమివ్వనున్న విశాఖ
England Team Arrives Hyderabad For Test Series

భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు వచ్చేసింది. నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఇంగ్లిష్ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్ల నుదుటన తిలకం దిద్ది ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ బోర్డు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 25న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. రెండో టెస్టుకు విశాఖపట్టణం వేదిక కానుంది. కాగా, విమానాశ్రయంలో క్రికెటర్లను చూసిన అభిమానులు వారిని తమ సెల్‌ఫోన్లలో బంధించేందుకు పోటీపడ్డారు.

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల్లో భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. భారత్-ఇంగ్లండ్ జట్లు చివరిసారి 2021/22లో తలపడ్డాయి. ఆ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన 16 మందితో కూడిన భారత జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. అతడు మరో 152 పరుగులు చేస్తే టెస్టుల్లో 9 వేల పరుగులు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.   
 
తొలి రెండుటెస్టులకు భారత జట్టు
రోహిత్‌శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్.

ఇంగ్లండ్ జట్టు
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, రెహాన్ అహ్మద్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, జోరూట్, మార్క్‌వుడ్, షోయిబ్ బషీర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), డాన్ లారెన్స్, టామ్ హార్ట్లీ, జాక్‌లీచ్, అలీ పోప్, అలీ రాబిన్సన్

More Telugu News