Surya Tilak: ఏటా శ్రీరామ నవమి నాడు బాల రాముడిని ముద్దాడనున్న సూర్యుడు.. రామమందిరంలో ప్రత్యేక ఏర్పాటు

  • ఏడాదికి ఓరోజు గర్భగుడిలో విగ్రహానికి సూర్యతిలకం
  • ఆరు నిమిషాల పాటు నుదిటిపై ప్రసరించేలా డిజైన్
  • ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సాయంతో నిర్మాణం
Once a year a special Surya Tilak will adorn the forehead of Ram Lalla

అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్న రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహాన్ని ఏటా శ్రీరామ నవమి నాడు సూర్యుడు ముద్దాడనున్నాడు. దాదాపుగా ఆరు నిమిషాల పాటు గర్భగుడిలోని విగ్రహం నుదుటన ప్రకాశించనున్నాడు. బాల రాముడికి సూర్యతిలకంగా మారనున్నాడు. ఇందుకోసం మందిర నిర్మాణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. సూర్యుడి సంచారం ఆధారంగా ఏటా శ్రీరామ నవమి నాడు సూర్య తిలకం ఏర్పడేలా ప్రత్యేకమైన అద్దాలను అమర్చనున్నారు. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) సాయం తీసుకున్నట్లు సమాచారం.

మందిరం పూర్తయ్యాక మూడో అంతస్తు నుంచి సూర్య కిరణాలు గర్భగుడిలోని విగ్రహంపై అదీ ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది. బాల రాముడికి సూర్య తిలకంగా వ్యవహరిస్తున్నారు. ఏటా శ్రీరామ నవమికి మధ్యాహ్నం 12 గంటలకు ఈ సూర్య తిలకం మొదలై ఆరు నిమిషాల పాటు బాల రాముడి విగ్రహం నుదుటన ప్రకాశించనుంది. దీనికోసం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. దీనికి అవసరమైన వస్తువులను బెంగళూరుకు చెందిన ఆప్టిక్స్ సంస్థ తయారుచేసిచ్చింది.

రామ మందిరం మూడో అంతస్తు నుంచి గర్భగుడిలో విగ్రహంపైకి సూర్య కిరణాలు ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్‌బాక్స్‌లు, గొట్టాలను అమర్చనున్నారు. చంద్రమాన తిథికి అనుగుణంగా ఏటా శ్రీరామ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు విగ్రహం నుదుటన సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. కాగా, రామ మందిరం నిర్మాణంతో పాటూ ఈ ప్రత్యేక వ్యవస్థలోనూ ఎలాంటి ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్తు వాడలేదని టెంపుల్ ట్రస్ట్ వెల్లడించింది.

More Telugu News