IT in Hyderabad: ఐటీ రంగంలో భాగ్యనగరమే టాప్: ఐస్ప్రౌట్ వ్యవస్థాపకులు

Hyderabad top in IT sector says Isprout founders
  • రాయదుర్గంలో ఆదునిక కేంద్రం ప్రారంభం
  • భారత్‌పై అమెరికా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండదని వ్యాఖ్య
  • ఈ ఏడాదికి 20 లక్షల చదరపు అడుగులకు చేరుకోవడమే లక్ష్యమని వెల్లడి    
ఐటీ రంగంలో భాగ్యనగరం యావత్ దేశంలోనే అగ్రగామిగా ఉందని వివిధ రంగాలకు కార్యాలయ స్థలాలను సమకూర్చే ఐస్ప్రౌట్ సంస్థ వ్యవస్థాపకులు సుందరి పాటిబండ్ల, శ్రీని తీర్ధాల పేర్కొన్నారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ఆరో ఆర్బిట్ ఐటీ భవనంలోని 5వ అంతస్తులో ఆ సంస్థ సరికొత్తగా తీర్చిదిద్దిన కార్యాలయ కేంద్రాన్ని శనివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరిరువురు పలు విషయాలపై చర్చించారు. 

‘‘అమెరికా, ఇంగ్లండ్‌లలోని ఆర్థిక మాంద్యం భారత్‌పై ఎటువంటి ప్రభావం చూపదు. ఆ దేశాల బహుళ జాతి సంస్థలు మానవ వనరులతో పాటూ అన్ని సౌకర్యాలు అందుబాటు ధరలలో లభించే భారత్‌వైపు చూస్తాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఐటీ మరింత వృద్ధి సాధిస్తుందనడంలో సందేహం లేదు. కొవిడ్ నేపథ్యంలో ఐటీ సంస్థలు ఇంటి నుంచి పనులు చేయించినా పరిస్థితులు చక్కబడడంతో తిరిగి కార్యాలయాల్లో ఉద్యోగులు కార్యకలాపాలు ప్రారంభించేలా చూస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ  కార్యాలయాల స్థలాలకు గిరాకీ పెరిగింది. నగరంలో ఏటా ఐటీ సంస్థల కార్యాలయాల విస్తరణ రెట్టింపు అవుతోంది. కార్యాలయాల సాంద్రతలో బెంగళూరు ముందంజలో ఉన్నా కార్యాలయాల వినియోగంలో హైదరాబాద్‌దే అగ్రస్థానం’’ అని అన్నారు. 

‘‘2017లో నగరంలో 11 వేల చదరపు అడుగులతో ఐస్ప్రౌట్ సంస్థ ప్రారంభించాం. నేడు పది లక్షల చదరపు అడుగులు అధిగమించింది. హైదరాబాద్‌తో పాటూ బెంగళూరు, విజయవాడ, చెన్నై, పుణెల్లో కేంద్రాలున్నాయి. ఢిల్లీ, నోయిడా, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్‌లకూ విస్తరించనున్నాం. రాయదుర్గంలో కొత్తగా 2.5 లక్షల చదరపు అడుగుల్లో అయిదంతస్తుల్లో, 4 వేల సీట్లతో కేంద్రాన్ని ప్రారంభించాం. అందులో ఇప్పటికే 60 శాతం స్థలంలో కార్యాలయాలు వచ్చాయి. ఈ ఏడాది చివరినాటికి 50 కేంద్రాలు, 20 లక్షల చదరపు అడుగులకు చేరుకోవడమే మా లక్ష్యం. ఇప్పటివరకూ రూ.100 కోట్లు పెట్టుబడిగా పెట్టాం. మరో రూ.200 కోట్ల పెట్టుబడులతో వ్యాపారాన్ని విస్తరిస్తున్నాం. కనీసం  50 మంది ఉద్యోగులున్న సంస్థలకు కార్యాలయాలు అందజేస్తాం. 5 శాతం అంకుర సంస్థలకు అందజేస్తాం. వివిధ దేశాలకు చెందిన బహుళ జాతి సంస్థలూ తమ కేంద్రాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేశాయి’’ అని తెలిపారు.
IT in Hyderabad
Isprout
IT sector

More Telugu News