Chiranjeevi: ఎన్టీఆర్ హవాలోనూ అక్కినేని ఎలా సక్సెస్ అయ్యారో చెప్పిన చిరంజీవి

  • విశాఖలో ఎన్టీఆర్ వర్ధంతి, ఏఎన్నార్ శతజయంతి కార్యక్రమం
  • చీఫ్ గెస్టుగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి 
  • ఏఎన్నార్ తో అనుబంధం గురించి వివరణ
Chiranjeevi talks about Akkineni Nageswara Rao

విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ శతజయంతి వేడుకల కార్యక్ర టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన ప్రసంగంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ల  గురించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. 

"అక్కినేని నాగేశ్వరరావు గారితో నేను మెకానిక్ అల్లుడు చిత్రం చేశాను. ఈయన (ఎన్టీఆర్) తో షూటింగ్ లో పక్కన కూర్చుని తినమన్నా గానీ కొంచెం టెన్షన్ ఉండేది. ఆయన (ఏఎన్నాఆర్)తో అలా కాదు... ఎంతో సరదాగా ఉండేవారు. 

సాయంత్రం అయితే... ఇంటికి రా చిరంజీవీ... మనం కూర్చుందాం అనే వారు. ఆయనకు కోన్యాక్ (ఓ రకం మద్యం బ్రాండ్) అంటే చాలా ఇష్టం. నేను ఫారెన్ వెళ్లినప్పుడు మంచి కోన్యాక్ బాటిల్ కనిపిస్తే ఎంత ఖరీదైనా తీసుకువచ్చి ఆయనకు గిఫ్టుగా ఇచ్చేవాడ్ని. అప్పుడు ఆయన పుచ్చుకుంటుండగా, నేను పక్కన కూర్చుని కబుర్లు చెబుతూ ఉండేవాడ్ని. 

ఆ సమయంలో ఆయన చెప్పే మాటలన్నీ కొంచెం రొమాంటిక్ టచ్ తో ఉండేవి. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆ సమయంలో ఆయన ఒక గొప్ప విషయం చెప్పారు. 

"చిరంజీవీ... రామారావు, నేను ఒకే సమయంలో వచ్చాం. ఆయన మంచి అందగాడు, ఆజానుబాహుడు. మంచి ముఖ వర్చస్సు ఉన్నవాడు. అలాంటి స్ఫురద్రూపి ముందు నన్ను నేను చూసుకుంటున్నప్పుడు ఒక్కోసారి ఆత్మన్యూనతా భావం కలిగేది. ఆయనతో కలిసి నేను 14 సినిమాల వరకు చేశాను. 

ఆ సమయంలో నన్ను నేను దీటుగా నిలబెట్టుకోవడానికి, నన్ను నేను సమాయత్తం చేసుకోవడానికి, నేనూ ఏం తక్కువ కాదు అనిపించుకోవడానికి అద్దం ముందు నిలబడి నేను ఇలా అనుకునేవాడ్ని. ఆయన ఆజానుబాహుడు కావొచ్చు, నేను ఇంతే ఉండొచ్చు! కానీ మానసికంగా నేను చాలా గట్టివాడ్ని అంటూ శరీరాన్ని ఒక జెర్క్ తో కదిలించేవాడ్ని. అలా శరీరాన్ని కదిలించడం ఒక స్టయిల్ అయిపోయింది. 

దాంతో పాటే, నాకు ఒక కన్ను కొంచెం వాలినట్టుగా అయిపోతుండేది... దాన్ని కవర్ చేసుకోవడానికి ఆ కనుబొమ్మను కొద్దిగా పైకిలేపినట్టుగా చేసేవాడ్ని. అది కూడా ఒక స్టయిల్ అయిపోయింది" అంటూ ఆయన తనలో ఉండే బలహీనతలను గుర్తించి, వాటినే తన బలాలుగా ఎలా మార్చుకున్నారో అక్కినేని గారు చెప్పారు. 

ప్రతి ఒక్కరికీ తమ బలాలు ఏవో తెలియకపోవచ్చు, కానీ బలహీనతలు తెలుస్తాయి... వాటినే బలాలుగా మార్చుకోవడం గొప్ప విషయం... అదే నేను అక్కినేని గారి ద్వారా తెలుసుకున్నాను" అంటూ చిరంజీవి వివరించారు.

More Telugu News