Chandrababu: ఇది నా కోసమో, పవన్ కల్యాణ్ కోసమో కాదు: చంద్రబాబు

  • కోనసీమ జిల్లా మండపేటలో రా కదలిరా సభ
  • హాజరైన చంద్రబాబు
  • కోనసీమ అందమైన ప్రదేశం అని వెల్లడి
  • అలాంటి ప్రాంతాన్ని హింసాత్మకంగా మార్చివేశారని ఆగ్రహం
  • వైసీపీ మరోసారి వస్తే ఎవరూ ఆనందంగా ఉండరని వ్యాఖ్యలు
Chandrababu says he calls for Raa Kadali Raa not for him or Pawan Kalyan

టీడీపీ అధినేత చంద్రబాబు కోనసీమ జిల్లా మండపేటలో రా కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కోనసీమ ఎంతో అందమైన ప్రదేశం అని అభివర్ణించారు. 

నిన్ననే కోడిపందాలు కూడా జరిగాయని, అతిథి మర్యాదలకు మారుపేరు ఈ కోనసీమ అని కొనియాడారు. మంచి నీళ్లు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి మనసున్న మనుషులు ఇక్కడివారు అని వివరించారు. 

డొక్కా సీతమ్మ వంటి మహనీయురాలు ఇక్కడి గడ్డపైనే పుట్టిందని, ఎవరైనా అన్నం అడిగితే లేదనకుండా వారి కడుపునింపిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని చంద్రబాబు పేర్కొన్నారు. గన్నవరం అక్విడెక్ట్ కు ఆమె పేరే పెట్టామని వెల్లడించారు. 

ఇక రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ... ఈసారి అమలాపురం పార్లమెంటు స్థానం పరిధిలోని 7 సీట్లనూ టీడీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆత్రేయపురం అంటే పూతరేకులు గుర్తొస్తాయని, ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతంలోనూ చిచ్చుపెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దాడులు, కేసులు, ఆత్మహత్యలతో కోనసీమ ప్రాంతాన్ని హింసకు కేంద్రంగా మార్చేశారని విమర్శించారు. 

మొన్ననే కోనసీమలో ఇంటర్నెట్ నిలిపివేశారంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. 45 ఏళ్లుగా ఎన్నడూ చూడని విచిత్రాన్ని ఈ వైసీపీ సైకో పాలనలోనే చూస్తున్నాం అని వ్యాఖ్యానించారు. 

"ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎప్పుడూ కూడా పౌరుషంగా మాట్లాడని మీరు... ఇవాళ అరాచకాలు, రౌడీయిజం చూస్తున్నారు. కోనసీమను మరో పులివెందుల చేయాలనుకుంటున్నారు. పులివెందులనూ మార్చుతాం గానీ, కోనసీమలో మీ రౌడీయిజం జరగనివ్వనని మండపేట నుంచి మరొక్కసారి చెబుతున్నాను. ఐదేళ్లయిపోయింది. ఈ పార్టీ (వైసీపీ) మళ్లీ గెలిచే పరిస్థితే లేదు. ఈ పార్టీ మళ్లీ వస్తే ఏ ఒక్కరు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి ఉండదు" అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

"ఇవాళ నేను రా కదలిరా అని పిలుపునిచ్చాను. ఇది నా కోసం కాదు. దగా పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ఒక రైతు కోసం, ఒక కూలీ కోసం, ఒక నిరుద్యోగి కోసం... రాష్ట్రమంతి కదలి రావాలని పిలుపునిచ్చాను. అందుకు మీరంతా స్పందించారు. ఇది నా కోసమో, పవన్ కల్యాణ్ కోసమో కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత" అని చంద్రబాబు ఉద్ఘాటించారు.

More Telugu News