Raghunandan Rao: ప్రధాని మోదీ, అమిత్ షాలు ఏం చెప్పారో రేవంత్ రెడ్డే చెప్పారు: బీజేపీ నేత రఘునందన్ రావు

  • ఆ ఐదుగురు పోటీ చేయాలి... ఒక్కరూ గెలవరన్న రఘునందన్ రావు
  • రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే 350 సీట్లకు పైగా గెలుస్తుందని ధీమా
  • రాష్ట్రంలో కాంగ్రెస్.. దేశంలో బీజేపీ ఉండగా బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్న
Raghunandan Rao challenges KCR family for lok sabha polls

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని మాట ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని మొదటిసారి కలిసిన అనంతరం మీడియా ముఖంగా చెప్పారని బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గుర్తు చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమకే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. బీఆర్ఎస్‌లో పార్టీ కోసం పని చేసిన వారికి టిక్కెట్ రాదని విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలో డబ్బులు ఉన్న వారికే టిక్కెట్ ఇస్తారన్నారు. మెదక్‌లో బీజేపీ ఉందా? లేదా? అనే విషయాన్ని పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో హరీశ్ రావుకు ప్రజలు చూపిస్తారని వ్యాఖ్యానించారు.

మీకు ఓటు ఎందుకు వేయాలి?

సీపీఎంకు చెందిన మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమ రాష్ట్ర అభివృద్ధి కోసం రావాలని కోరగా... వెళ్లి వారి కేబినెట్ సమావేశంలో కూర్చున్న గొప్ప మనసున్న వ్యక్తి ప్రధాని మోదీ అని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ గత పదేళ్లలో ఏ జిల్లా పరిషత్ సమావేశానికి రాలేదని ఆరోపించారు. దాదాపు సగం రోజులు అసెంబ్లీకి రాలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ... టిక్కెట్లను అమ్మితే వాటిని కొనుక్కొని గెలిచిన ఎంపీలు తెలంగాణ కోసం పార్లమెంట్‌లో ఎప్పుడూ మాట్లాడలేదని ఆరోపించారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు గౌరవం ఇచ్చారా? అని ప్రశ్నించారు. అలాంటప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు.

కృష్ణా జలాల్లో మనకు అన్యాయం జరిగింది... ఢిల్లీకి వెళ్లి మాట్లాడుదామని ఒక్కసారైనా కేసీఆర్ లేదా హరీశ్ రావు తీసుకు వెళ్లారా? అని ప్రశ్నించారు. సాక్షాత్తు ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తే ముఖం చాటేసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. తెల్లారి లేస్తే మోదీపై విమర్శలు చేసే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసి తమ రాష్ట్రాల అభివృద్ధిపై మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ప్రధాని మోదీ తనకు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో అన్నారని గుర్తు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తనకు తొమ్మిది మంది ఐపీఎస్‌లను అటాచ్ చేశారని మన ముఖ్యమంత్రి చెప్పారన్నారు.

ఎన్డీయేకు 350 నుంచి 400 సీట్లు

దేశంలో ఏ సర్వే చూసినా 350 నుంచి 400 వరకు సీట్లు గెలిచి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని.. అలాంటప్పుడు దేశమంతా ఒకదిక్కు వెళ్తే.. తెలంగాణ మరో దిక్కు వెళ్తుందా? అన్నారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి తెలంగాణతో కేసీఆర్ పేగు బంధాన్ని తెంచుకున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయినా ఇంకా భూమి పైకి రాలేదని, కార్యకర్తలను గౌరవించడం లేదని విమర్శించారు. గెలిచే సీట్లు అమ్ముకోవడమే బీఆర్ఎస్‌కు తెలుసునని ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణ ఓటమి చవి చూస్తుందన్నారు.

ఐదుగురిలో ఒక్కరూ గెలవరు

చేతనైతే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్, కవితలు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని... వారు ఒక్కరు కూడా గెలవరని సవాల్ చేశారు. టిక్కెట్లు అమ్ముకొని ఇతరులతో పోటీ చేయించడమే వారికి తెలుసు అన్నారు. బీజేపీకి తెలంగాణలో అవకాశం లేదని వ్యాఖ్యానించడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణలోని 17 లోక్ సభ సీట్లలో ఎక్కువ సీట్లు గెలిచేది తామే అన్నారు. బీజేపీకి, బీఆర్ఎస్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని... కేంద్రంలో బీజేపీ ఉందని.. మళ్లీ మేమే గెలుస్తామని.. అలాంటప్పుడు బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు వేసే ప్రతి ఓటు మూసీనదిలో వేసినట్లే అన్నారు. ఆ పార్టీకి సున్నా చుట్టాలన్నారు.

More Telugu News