TDP: 'కోడికత్తి' శ్రీను బయటికి వస్తే వాస్తవాలు బయటపడతాయని జగన్ భయపడుతున్నారు: పిల్లి మాణిక్యాలరావు

  • దీక్ష చేపట్టిన 'కోడికత్తి' శ్రీను కుటుంబం
  • మద్దతు ప్రకటించిన టీడీపీ అగ్రనేతలు
  • బాబాయ్ పై గొడ్డలివేటు వేయించిన జగన్ ను ఏంచేయాలన్న మాణిక్యాలరావు
TDP leaders extends their support to Janupalli Sreenu family

కోడికత్తి కేసు నిందితుడు జనుపల్లి శ్రీను కుటుంబం కొన్నిరోజులుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, అతని కుటుంబానికి టీడీపీ అగ్రనేతలు మద్దతు పలికారు. శ్రీను కుటుంబానికి అండగా ఉంటామని పిల్లి మాణిక్యాలరావు, వర్ల రామయ్య, బోండా ఉమ ప్రకటించారు. ఈ సందర్భంగా పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ, 'కోడికత్తి' శ్రీను ఇంకా జైల్లోనే ఉండడం అన్యాయం అని అన్నారు.

కోడికత్తితో గాయం చేశాడన్న కారణంతో శ్రీనును ఇబ్బంది పెడుతున్నారని, కానీ బాబాయ్ పై గొడ్డలివేటు వేయించిన సీఎం జగన్ ను ఏం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీను బయటికి వస్తే వాస్తవాలు బయటపడతాయని జగన్ భయపడుతున్నారని పిల్లి మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడిస్తే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావని అన్నారు.

విమానాశ్రయంలో ఏం జరిగిందో ఆ దేవుడికే తెలుసు: శ్రీను తండ్రి తాతారావు


'కోడికత్తి' శ్రీను తండ్రి తాతారావు తన కుమారుడి పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ను ఎంతో అభిమానించే తన కొడుకును ఐదేళ్లుగా జైల్లోనే ఉంచారని వాపోయారు. ఆ రోజున విమానాశ్రయంలో ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ కనికరించి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని అర్థించారు. తన కుమారుడికి బెయిల్ వచ్చేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో ఎలాంటి కుట్ర లేదని ఎన్ఐఏ స్పష్టం చేసినా జగన్ వినిపించుకోవడంలేదని పేర్కొన్నారు.

More Telugu News