Harbhajan Singh: ఆ పార్టీలతో నాకు సంబంధం లేదు.. నేనైతే అయోధ్య వెళుతున్నా.. తేల్చి చెప్పిన హర్భజన్‌సింగ్

  • ఈ రోజుల్లో రామమందిర నిర్మాణం మన అదృష్టమన్న హర్భజన్ సింగ్
  • తానైతే వెళ్లి రామయ్య ఆశీస్సులు తీసుకుంటానని స్పష్టం చేసిన ఆప్ రాజ్యసభ సభ్యుడు
  • తాను వెళ్లడం లేదన్న ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్
Harbhajan Singh Said That He Will Go Ram Mandir inauguration

ఇతర పార్టీలతో తనకు సంబంధం లేదని, తానైతే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు వెళుతున్నానని టీమిండియా మాజీ బౌలర్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ తేల్చి చెప్పారు. 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకాకూడదని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్న వేళ హర్భజన్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది.

ఈ రోజుల్లో రామమందిర నిర్మాణం మన అదృష్టమని పేర్కొన్న హర్భజన్.. మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై రాముడి ఆశీస్సులు తీసుకోవాలని పేర్కొన్నారు. తానైతే తప్పకుండా రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై రాముడి ఆశీర్వాదం తీసుకుంటానని స్పష్టం చేశారు. 

మరోపక్క, అయోధ్య వేడుకకు తాను హాజరుకావడం లేదని ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేస్తూనే, తనకింకా ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. అయితే, 22 తర్వాత తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో కలిసి రామమందిరాన్ని సందర్శిస్తానని తెలిపారు. పార్టీ అధికారికంగా రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాకున్నా తాను మాత్రం వెళుతున్నట్టు హర్భజన్ చెప్పడం సొంత పార్టీలో కలకలం రేపింది.

More Telugu News