MBZ: 700 కార్లు.. 4 వేల కోట్ల విలువైన ప్యాలెస్, 8 జెట్ విమానాలు ఓ కుటుంబం ఆస్తులివి.. వీడియో చూడండి!

  • యూఏఈ అధ్యక్షుడు ఎంబీజడ్ ఆస్తులివి
  • 8 పెంటగాన్‌లో పట్టేంత భవనం
  • ప్రపంచంలోని చమురు నిల్వల్లో 6 శాతం వీరివద్దే
  • ప్రపంచంలోనే ధనిక ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ సిటీకి యజమానులు
  •  ఐదేళ్లలో 28 వేల శాతం పెరిగిన కంపెనీ విలువ
  • పదివేల మందికి ఉపాధి
Worlds Richest Family Owns 700 Cars and 8 Jets And Rs 4000 Cr Palace

ఇది కొంత అసూయ కలిగించే వార్తే. అయినా ఆసక్తికరమే.  700 కార్లు, 4 వేల కోట్ల విలువైన ప్యాలెస్, 8 జెట్ విమానాలు..  అమ్మకానికి కాదు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం ఆస్తులివి. ఈ మొత్తం ఆస్తిలో లేశమాత్రమైనా మనకుంటే చాలన్న భావన కలగడంలో తప్పులేదు. ఆ ప్యాలెస్‌లో ఏకంగా 8 పెంటగాన్‌లు (అమెరికా రక్షణ వ్యవహారాల కేంద్ర సముదాయం) పట్టేస్తాయి. అంతేకాదు, ఈ కుటుంబానికి ఉన్న పాప్యులర్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రపంచంలో అత్యంత ధనిక క్లబ్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్(ఎంబీజడ్) ఈ కుటుంబ పెద్ద. ఆయనకు 18 మంది సోదరులు, 11 మంది తోబుట్టువులు ఉన్నారు. ఆయనకు స్వయంగా 8 మంది పిల్లలు, 18 మంది మనవళ్లు ఉన్నారు. 

స్పేస్ ఎక్స్‌లోనూ పెట్టుబడులు
ప్రపంచంలోని చమురు నిల్వల్లో ఆరుశాతం ఆయన కుటుంబం సొంతం. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్లబ్ అయిన మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ కూడా వీరిదే. అంతేకాదు, ప్రపంచంలోని పలు ప్రముఖ కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. ఈ కంపెనీల్లో పాప్ సింగర్ రిహన్నా బ్యూటీ బ్రాండ్ ఫెంటీ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ వరకు ఉన్నాయి. 

ప్రపంచంలోనే అతిపెద్ద ఎస్‌యూవీ
అధ్యక్షుడి చిన్న తమ్ముడు షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్‌ వద్ద 700 కార్లు ఉన్నాయి. వీటిలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఎస్‌యూవీ, ఐదు బుగాటి వేరాన్స్, లంబోర్గిని రెవెన్షన్, మెర్సెడెస్ బెంజ్ సీఎల్‌కే జీటీఆర్, ఫెరారీ 599XX, మెక్‌లారెన్ ఎంసీ12 వంటివి ఉన్నాయి. 

3.5 లక్షల క్రిస్టల్స్‌తో షాండ్లియర్
ఈ రాజ కుటుంబం అబుదాబిలోని గిల్డెడ్ ఖస్ర్  అల్ వతన్ అధ్యక్ష భవనంలో నివసిస్తోంది. ఇది దాదాపు 94 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ భవనంలోని షాండ్లియర్‌ను 3.5 లక్షల క్రిస్టల్స్‌తో తయారుచేశారు. ఇళ్లలో చారిత్రక కళాఖండాలు కొలువుదీరాయి.  కుటుంబ ప్రధాన పెట్టుబడి కంపెనీకి అధ్యక్షుడు ఎంబీజడ్ మరో సోదరుడు తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నాయకత్వం వహిస్తున్నారు. దీనివిలువ గత ఐదేళ్లలో దాదాపు 28 వేల శాతం పెరిగింది. ప్రస్తుతం 235 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ కంపెనీ వ్యవసాయం, ఇంధనం, వినోదం, సముద్ర వ్యాపారాలను కలిగి ఉంది. వీటిలో దాదాపు పదివేలమంది పనిచేస్తున్నారు.  

లండన్, పారిస్‌లోనూ ఖరీదైన ఆస్తులు
యూఏఈలోనే కాదు.. లండన్, పారిస్‌లోనూ ఈ కుటుంబానికి ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. ఈ కుటుంబ మాజీ అధిపతిని ‘ల్యాండ్ లార్డ్ ఆఫ్ లండన్’ అని పిలిచేవారు. యూకేలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఆస్తులు ఉండడంతో ఆయనకాపేరు వచ్చింది. 2015లో న్యూయార్క్‌లోని ఓ నివేదిక ప్రకారం బ్రిటిష్ రాజకుటుంబంతో పోల్చదగిన ఆస్తులను దుబాయ్ రాజకుటుంబం కలిగి ఉంది. 

రూ.2,122 కోట్లకు మాంచెస్టర్ సిటీ క్లబ్ కొనుగోలు
ఎంబీజడ్ అబుదాబి యునైటెడ్ గ్రూప్ 2008లో యూకే ఫుట్‌బాల్ జట్టు మాంచెస్టర్ సిటీని రూ. 2,122 కోట్లకు కొనుగోలు చేసింది. మాంచెస్టర్ సిటీ, ముంబై సిటీ, మెల్‌బోర్న్ సిటీ, న్యూయార్క్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌లను నిర్వహిస్తున్న సిటీ ఫుట్‌బాల్ గ్రూపులో 81 శాతం ఈ కంపెనీ యాజమాన్యంలోనే ఉంది.

More Telugu News