Bharat Jodo Nay Yatra: రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై అసోంలో కేసు

  • షెడ్యూల్‌లో లేని రూట్‌లోకి యాత్రను మళ్లించి ట్రాఫిక్ అవాంతరాలు సృష్టించారని కేసు నమోదు
  • ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ నిర్వాహకుడు కేబీ బైజుపై ఎఫ్‌ఐఆర్
  • యాత్రకు ఆటంకాలు కలిగించాలనే ఉద్దేశంతోనే కేసు పెట్టారన్న కాంగ్రెస్
Case in Assam against Rahul Gandhis Bharat Jodo Nay Yatra

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడ్ న్యాయ్ యాత్ర’పై అసోంలో కేసు నమోదయింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూటులో మార్పులు చేయడమే ఇందుకు కారణమైంది. ఈ మేరకు యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం మధ్యాహ్నం జోర్హాట్ పట్టణంలో యాత్ర కొనసాగుతున్న సమయంలో ముందుగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి మళ్లించారని, చార్ట్‌లో చూపించని మార్గాన్ని ఎంచుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. రూట్‌ను అకస్మాత్తుగా మార్చడంతో అంతరాయాలు కలిగించిందని, యాత్ర నిర్వాహకులు, సహ నిర్వాహకులు ట్రాఫిక్ బారికేడ్‌లను బద్దలు కొట్టేలా అక్కడి సమూహాన్ని ప్రేరేపించారని అన్నారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులపై దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు.

కాగా ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై కేసు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ ఖండించింది. యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని కాంగ్రెస్‌కు చెందిన అసోం ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా అన్నారు.  ట్రాఫిక్ మళ్లింపు దగ్గర పోలీసులెవరూ లేరన్నారు. యాత్ర కోసం తమకు కేటాయించిన మార్గం చాలా ఇరుకుగా ఉందన్నారు. జనాలు పెద్ద సంఖ్యలో హాజరవ్వడంతో కొన్ని మీటర్ల పాటు పక్కనున్న దారి గుండా ప్రయాణించామని అన్నారు. సీఎం హిమంత బిశ్వా శర్మ యాత్ర విజయవంతమవుతోందని భయపడుతున్నారని దేబబ్రత సైకియా అన్నారు. అందుకే యాత్రకు ఆటంకం కలిగించాలనుకుంటున్నారని విమర్శించారు. కాగా అసోంలోని 17 జిల్లాల మీదుగా 833 కి.మీ మేర జనవరి 25 వరకు ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ కొనసాగనుంది.

More Telugu News