Nara Lokesh: మంగళగిరిని అభివృద్ధి పట్టాలెక్కిద్దాం... కలసిరండి!: తటస్థ ప్రముఖులకు నారా లోకేశ్ పిలుపు

- మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగుతున్న లోకేశ్ పర్యటనలు
- గత కొన్ని రోజులుగా తటస్థ ప్రముఖులతో లోకేశ్ భేటీలు
- మంగళగిరి అభివృద్ధికి సహకారం అందించాలంటూ విజ్ఞప్తి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో తటస్థ ప్రముఖులను కలుస్తూ, అభివృద్ది కోసం తనతో కలిసి రావాలని కోరుతున్నారు. లోకేశ్ ఇవాళ కూడా నియోజకవర్గంలో పలువురు తటస్థ ప్రముఖులను కలిశారు. మంగళగిరికి చెందిన ప్రముఖులు పొట్టి గిరిజ, ప్రగడ రాజశేఖర్, తెంపల్లి రాఘవేంద్రరావుల ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
అన్ని అవకాశాలున్నప్పటికీ కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేని మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ఇందుకోసం అన్నివర్గాలు కలసి రావాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
తొలుత మంగళగిరి 32వ వార్డులో నివాసముంటున్న వైద్య దంపతులు డాక్టర్ పొట్టి గిరిజ, డాక్టర్ పొట్టి ఆదినారాయణ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఆదినారాయణ సోదరులు కిరాణా మర్చంట్స్ గా స్థిరపడ్డారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలను లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. వైద్యులుగా నిత్యం వందలాది మందికి సేవలందిస్తున్న గిరిజ, ఆదినారాయణలను అభినందించిన లోకేశ్... రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో వైద్యసేవలు విస్తృతం చేసేందుకు మీవంటి వారి సహకారం తీసుకుంటాం అని వారితో చెప్పారు.
తర్వాత 14వ వార్డుకు చెందిన ప్రగడ రాజశేఖర్ ను వారి ఇంటివద్దకు వెళ్లి కలుసుకున్నారు. రాజశేఖర్ తాత ప్రగడ బాలనాగు సీకే ఎడ్యుకేషనల్ గ్రూప్ ను ఏర్పాటుచేసి విద్యాదాతగా పేరొందారు. రాజశేఖర్ కుటుంబం మంగళగిరిలో అతిపెద్ద యార్న్ ఎక్స్ పోర్టర్స్ గా చేనేత వ్యాపార రంగంలో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా చేనేతలు, విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాజశేఖర్... లోకేశ్ దృష్టికి తేగా, తాను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక తొలి ప్రాధాన్యత చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమేనని చెప్పారు. మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ జూనియర్ కాలేజి మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా రాజశేఖర్ అందిస్తున్న సేవలను కొనియాడారు. మంగళగిరి అభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలి అంటూ రాజశేఖర్ కుటుంబానికి విజ్ఞప్తి చేశారు.
లోకేశ్ చివరిగా 25వ వార్డుకు చెందిన తెంపల్లి రాఘవేంద్రరావును ఆయన నివాసంలో కలుసుకున్నారు. రాఘవేంద్రరావు విజయవాడలో టీవీఎల్ ఎలక్ట్రికల్ కంపెనీ అధినేతగా, దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలకు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అన్నిరకాల వనరులు, అవకాశాలున్న మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఇందుకు అన్నివర్గాలు కలిసి రావాలని లోకేశ్ కోరారు.






