Harish Rao: ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలకు అర్థమవుతోంది: హరీశ్ రావు

  • ఎన్ని కుట్రలు చేసినా గజ్వేల్ నుంచి కేసీఆర్ గెలిచారన్న హరీశ్ రావు
  • కేసీఆర్ ఎప్పుడూ గజ్వేల్ అభివృద్ధి కోసం ఆలోచించారని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శ
  • ప్రగతి భవన్‌లో బంగారు బాత్రూంలు ఉన్నాయా? అన్నది చెప్పాలని మల్లు భట్టికి ప్రశ్న
Harish Rao fires at congress in gajwel

 ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్‌ను ఓడించేందుకు ఎన్నో కుట్రలు జరిగాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలు కూడా కేసీఆర్‌ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాయన్నారు. కానీ ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ మంచి మెజార్టీతో గెలిచారని అన్నారు. హరీశ్ రావు ఈ రోజు గజ్వేల్ కృతజ్ఞతా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్‌ను గెలిపించిన బీఆర్ఎస్ కుటుంబానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. ఈ విజయం మీ అందరిదీ అని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.

గజ్వేల్‌లో కేసీఆర్ లక్ష్యంగా 154 నామినేషన్లు వచ్చాయని.. ఉపసంహరణ తర్వాత కూడా 47 మిగిలాయని గుర్తు చేశారు. ఇక్కడ నాలుగు ఈవీఎం మిషన్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారన్నారు. 2వేలకు పైగా ఓట్లు కారును పోలిన రోడ్డు రోలర్‌కు పడ్డాయని తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ 45వేల మెజార్టీతో గెలిచారన్నారు. గజ్వేల్‌పై కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కిందని... కానీ బీఆర్ఎస్ చరిత్రను తిరగరాసిందన్నారు. గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి గురించి మాత్రమే కేసీఆర్ ఆలోచించారన్నారు.

తాము అధికారంలోకి రాగానే పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు. డిసెంబర్ 9న రుణమాఫీ... నాలుగు వేలకు పెన్షన్ పెంపు... 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్... రైతు బంధు పెంపు.. ఇలా ఎన్నో చెప్పారని.. కానీ ఇప్పటి వరకు ఏదీ నెరవేర్చలేదన్నారు. ప్రగతి భవన్‌లో బంగారు బాత్రూంలు ఉన్నాయని గతంలో విమర్శించారని.. ఇప్పుడు అందులోనే ఉంటున్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అలాంటివి ఉన్నాయా? అన్నది చెప్పాలన్నారు. గతంలో కేటీఆర్ దావోస్‌కు వెళ్లి పెట్టుబడులు తీసుకు వస్తే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి వృథా అన్నారని.. ఇప్పుడు వారు ఎందుకు వెళ్లారు? అని నిలదీశారు.

బీజేపీతో పోరాటమని కాంగ్రెస్ చెబుతోందని.. కానీ తెలంగాణలో కీలక నేతలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులను ఓడించింది బీఆర్ఎస్ అని గుర్తుంచుకోవాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదానీ, అంబానీ చేతుల్లో ఈ దేశం ఉందని రాహుల్ గాంధీ ఓ వైపు విమర్శిస్తుంటే.. మరోవైపు రేవంత్ రెడ్డి, అదానీ కలిసి హగ్ చేసుకుంటున్నారని విమర్శించారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలకు అర్థమవుతోందన్నారు. గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారని... త్వరలో మీ ముందుకు వస్తారన్నారు.

More Telugu News