KTR: బీజేపీ ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు: కేటీఆర్

  • మొన్నటి వరకు మోదీ అదానీపై విమర్శలు గుప్పించిన రేవంత్ దావోస్‌లో అదానీతో జత కలిశారని విమర్శలు
  • ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని వ్యాఖ్య
  • ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితి వచ్చిందన్న కేటీఆర్
KTR alleges Revanth Reddy is working under bjp

బీజేపీ ఆదేశాల మేరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. మొన్నటి వరకు ప్రధాని నరేంద్రమోదీ, పారిశ్రామికవేత్త అదానీ ఒకటేనని విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దావోస్ వేదిక సాక్షిగా అదానీతో జత కలిశారన్నారు. బీజేపీ ఆదేశాల మేరకే వారు పని చేస్తున్నారని విమర్శించారు.

ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తామన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం దశలవారీగా చేస్తామని చెబుతున్నారన్నారు. ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితి వచ్చిందని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని చెబుతున్నారని... కానీ ఆస్తులు సృష్టించిందని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణను బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించామన్నారు.

More Telugu News