Viral Video: మొబైల్ చోరీ చేస్తూ దొరికిన యువకుడు.. కదులుతున్న రైలు కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు.. వీడియో ఇదిగో!

  • బీహార్‌లోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఘటన
  • ప్లాట్‌ఫాం బయటి నుంచి ప్రయాణికుడి మొబైల్ చోరీ చేసేందుకు యత్నం
  • చేతులు దొరకపుచ్చుకున్న ప్రయాణికులు
  • రైలు కదిలిన సమయంలో అతడి గ్యాంగ్‌లోని వారే వచ్చి రక్షించిన వైనం
Mobile Thief Dangles Outside Train Window in Bihar

రైలులో ప్రయాణికుడి మొబైల్ ఫోన్ తస్కరించేందుకు ప్రయత్నించి దొరికిపోయిన యువకుడిని ప్రయాణికులు నడుస్తున్న రైలు కిటికీ బయట వేలాడదీశారు. బీహార్‌లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. భాగల్‌పూర్‌లో రైలు ప్లాట్‌ఫాంపై ఆగివున్న సమయంలో నిందితుడు కిటికీలోంచి మొబైల్‌ను దొంగిలించే ప్రయత్నం చేయడంతో ప్రయాణికుడు వెంటనే అప్రమత్తమై అతడి చేయిని పట్టుకున్నాడు. తర్వాత అతడికి బోగీలోని మిగతా ప్రయాణికులు కలిశారు. అందరూ కలిసి అతడు తప్పించుకోకుండా లోపలి నుంచి అతడి చేతులను గట్టిగా పట్టుకున్నారు. 

అదే సమయంలో రైలు కదిలినప్పటికీ ప్రయాణికులు మాత్రం అతడి చేయిని విడిచిపెట్టలేదు. దీంతో కిటికీ బయట అతడు వేలాడుతూ కిందపడిపోకుండా తనను రక్షించమని వేడుకున్నాడు. రైలు నెమ్మదిగా కదులుతుండడంతో ప్లాట్‌ఫాంపై ఉన్న మరికొందరు పరిగెత్తుకు వచ్చి అతడిని రక్షించారు. అయితే, వారు అతడి గ్యాంగ్‌లోని వారేనని భావిస్తున్నారు. అక్కడితో ఆ వీడియో క్లిప్ ముగిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రైలులో ఇలా చోరీకి యత్నించి దొరికిపోయి కిటికీ బయట వేలాడడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. సెప్టెంబరు 2022లో ఇదే స్టేషన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. మొబైల్ దొంగతనం చేస్తూ దొరికిన దొంగను ఇలాగే 5 కిలోమీటర్లు వేలాడదీశారు.

More Telugu News