Team India: రోహిత్ శర్మ సూపర్ సెంచరీ, రింకూ అదుర్స్... టీమిండియా భారీ స్కోరు

  • టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడో టీ20
  • 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా
  • ఐదో వికెట్ కు అజేయంగా 190 పరుగులు జోడించిన రోహిత్, రింకూ
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసిన టీమిండియా
  • రోహిత్ శర్మ 121 నాటౌట్... రింకూ 69 నాటౌట్
Team India posts huge total with Rohit Sharma flamboyant century and Rinku Singh hard hitting

ఆఫ్ఘనిస్థాన్ తో మూడో టీ20లో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ డూపర్ సెంచరీతో ఆదుకున్నాడు. అగ్నికి వాయువు తోడైనట్టు రోహిత్ శర్మకు రింకూ సింగ్ జతకలవడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. 

రోహిత్ శర్మ, రింకూ సింగ్ అలవోకగా సిక్సర్లు కొడుతుండడంతో ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆరంభంలో వీరిద్దరూ కాస్త నిదానంగా ఆడినప్పటికీ, క్రీజులో కుదురుకున్నాక బౌలర్లుకు చుక్కలు చూపించారు. 

అసలు... 100 పరుగులు కొట్టడమే గొప్ప అనుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ 69 బంతుల్లోనే 121 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హిట్ మ్యాన్ స్కోరులో 11 ఫోర్లు, 8 భారీ సిక్సులు ఉన్నాయి. వాటిలో ఒక సిక్సు స్టేడియం పైకప్పును తాకడం విశేషం. 

మరో ఎండ్ లో రింకూ కూడా తాను కూడా తక్కువ తినలేదన్నట్టు హార్డ్ హిట్టింగ్ తో దుమ్మురేపాడు. రింకూ 39 బంతుల్లో 2 ఫోర్లు 6 సిక్సర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 190 పరుగులు జోడించడం ఈ మ్యాచ్ లో హైలైట్. వీరిద్దరి దూకుడు ఎలా సాగిందంటే, ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఆఫ్ఘన్ జట్టు ఏకంగా 36 పరుగులు సమర్పించుకుంది. కరీం జనత్ విసిరిన ఆ ఓవర్లో రోహిత్ శర్మ 2 సిక్సులు, 1 ఫోర్... రింకూ సింగ్ 3 సిక్సులు కొట్టారు.

ఆఫ్ఘన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ మాలిక్ 3, అజ్మతుల్లా ఒమర్జాయ్ 1 వికెట్ తీశారు. 

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఈ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ ల్లోనూ రోహిత్ శర్మ డకౌటే. దాంతో ఈ మ్యాచ్ లో ఎలా ఆడతాడన్న సందేహాల నడుమ బరిలో దిగిన రోహిత్ శర్మ... తన బ్యాట్ పదును ఎలాంటిదో చాటిచెప్పాడు. కెరీర్ లో మరో చిరస్మరణీయ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.

More Telugu News