Indigo: రన్‌‌వేపై డిన్నర్.. ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన ఇండిగో

  • జనవరి 14న జరిగిన ఘటనపై క్షమాపణలు కోరిన దేశీయ ఎయిర్‌లైన్స్ దిగ్గజం
  • గోవా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి మళ్లింపు
  • రన్‌వేపైనే ప్రయాణికులకు డిన్నర్‌ను ఏర్పాటు చేయడంపై విమర్శలు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో దిగొచ్చిన విమానయాన సంస్థ
Indigo apologized to passengers for the Dinner on the runway

ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో విమానం పక్కనే రన్‌వేపై కూర్చొని ప్రయాణికులు డిన్నర్ చేసిన ఘటనపై దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో స్పందించింది. ప్రయాణికులను క్షమాపణలు కోరింది. రన్‌వేపై కూర్చొని ప్యాసింజర్లు ఇబ్బందికరంగా భోజనం చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇండిగో దిగొచ్చింది. క్షమాపణ కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది. 

ఈ విషయంలో మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నామని, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, భవిష్యత్తు‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని, నిరంతరాయంగా సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. కాగా జనవరి 14న గోవా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్‌ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబై మళ్లించారు. ప్రయాణికులు అక్కడ చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో వారికి రన్‌వేపైనే భోజనాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఘటనపై ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్‌లైన్ కోచ్‌లోకి వెళ్లేందుకు ప్రయాణికులు నిరాకరించడంతో, సీఐఎస్‌ఎఫ్ బృందంతో ఎయిర్‌పోర్టు ఆపరేటర్లు సమన్వయం చేసుకొని వారిని సేఫ్టీ జోన్‌లోకి తీసుకొచ్చారని తెలిపింది.

More Telugu News