DGCA: 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమయ్యే విమానాలను ఎయిర్‌లైన్స్ రద్దు చేయవచ్చు.. తాజా మార్గదర్శకాల జారీ

  • విమాన టికెట్‌పైనే మార్గదర్శకాల ముద్రణ
  • ఫ్లైట్ రద్దయితే ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ భద్రత కల్పించాలి
  • ఇటీవల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో నూతన మార్గదర్శకాలను జారీ చేసిన డీజీసీఏ
Airlines can cancel flights if they are delayed by more than 3 hours Says DGCA New guidelines

విమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించి ఇటీవల వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. సోమవారం నూతన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను (ఎస్‌వోపీ) జారీ చేసింది. ఫ్లైట్ సర్వీసు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ఆ విమానాన్ని ఎయిర్‌లైన్స్ సంస్థ రద్దు చేసేందుకు డీజీసీఏ వీలు కల్పించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టుల వద్ద రద్దీ నియంత్రణ, ప్రయాణికులకు వీలైనంతగా అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా డీజీసీఏ దీనిని రూపొందించింది. అయితే విమానం రద్దయితే ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు భద్రత కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా బోర్డింగ్‌ల తిరస్కరణ, విమానాల రద్దు, ముందస్తు సమాచారం లేని జాప్యాల సందర్భాల్లోనూ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

విమాన టికెట్‌పైనే మార్గదర్శకాల ముద్రణ..
కొత్త మార్గదర్శకాలలో భాగంగా విమాన టిక్కెట్లపై సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్‌ను (CAR) ముద్రిస్తారు. ఈ మార్గదర్శకాలను విమానయాన సంస్థలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అయితే అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే సీఏఆర్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ మధ్య పొగమంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయాలకు సంబంధించి ప్రయాణికుల నుంచి వరుస ఫిర్యాదులు అందిన నేపథ్యంలో డీజీసీఏ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఇతర కీలక మార్గదర్శకాలు ఇవే..

  • విమానయాన సంస్థలన్నీ విమానాల ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని నిర్దిష్ట సమయంతో సహా ప్రయాణికులకు తెలియజేయాలి. అధికారిక వెబ్‌సైట్, బాధిత ప్రయాణికులకు మెసేజ్ లేదా వాట్సప్, ఈ-మెయిల్, ఇతర నోటిఫికేషన్‌ మార్గాల ద్వారా ముందస్తు సమాచారం అందించాలి. 
  • ఎయిర్‌పోర్ట్‌లలోని ఎయిర్‌లైన్ సిబ్బంది ప్రయాణికుల పట్ల ఓపికగా నడుచుకోవాలి. విమానాల ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని అర్థమయ్యేలా వివరించాలి. ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేస్తుండాలి.

More Telugu News