Viral Pics: చైనాలో భారతీయ ఇంజినీర్‌‌కు ఊహించని అనుభవం!

  • ఎయిర్‌పోర్టులోని ఫింగర్‌ప్రింట్ సెల్ఫ్ కలెక్షన్ మెషీన్‌లో హిందీ భాషలో సూచనలు
  • పర్యాటకుడి భారత పాస్‌పోర్టును గుర్తుపట్టి హిందీలో సూచనలు ఇచ్చిన ఫింగర్ ప్రింట్ సెల్ఫ్ కలెక్షన్ మెషిన్
  • తన అనుభవాన్ని వివరిస్తూ భారత ఇంజినీర్ పెట్టిన పోస్ట్‌కు నెట్టింట భారీ స్పందన
  • చైనా విజయానికి కారణం ఇదేనంటూ వెల్లువెత్తుతున్న కామెంట్స్
Man Visiting China Shares Machines Speaking In Hindi On Detecting Passport

ఇటీవల చైనాకు వెళ్లిన ఓ భారతీయ ఇంజినీర్‌‌కు ఆశ్చర్యకర అనుభవం ఎదురైంది. అక్కడి ఎయిర్‌పోర్టులోని ఫింగర్ ప్రింట్ సెల్ఫ్ కలెక్షన్ మెషిన్ ఆయన భారత పాస్‌పోర్టును గుర్తుపట్టగానే హిందీలో సూచనలు ఇవ్వడం ప్రారంభించింది. చైనాలాంటి దేశంలో హిందీ చూసిన ఆ ఇంజినీర్ ఆశ్చర్యపోయారు. తనకెదురైన అనుభవాన్ని శంతను గోయెల్ నెట్టింట పంచుకున్నారు. ‘‘ఇప్పుడే ఎయిర్ పోర్టులో దిగాను..ఇక్కడి మెషిన్లు నా భారత పాస్‌పోర్టు గుర్తుపట్టిన వెంటనే హిందీలో సూచనలు ఇవ్వడం ప్రారంభించాయి’’ అని ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. 

ఈ ఉదంతం నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. అనేక మంది తమ సందేహాలను కామెంట్ సెక్షన్లో పంచుకున్నారు. హిందీతో పాటూ ఇతర భారతీయ భాషలు కూడా ఉన్నాయా? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి శంతను సమాధానమిస్తూ స్క్రీన్‌పై హిందీ మాత్రమే కనిపించిందని వివరించాడు. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు చైనా అనుసరిస్తున్న విధానాలపై కొందరు ప్రశంసలు కురిపించారు. విదేశీ పర్యాటకులు సొంత దేశంలో ఉన్నామనే భావన కల్పించేలా చైనా సకల సౌకర్యాలూ కల్పిస్తోందని చెప్పుకొచ్చారు. చైనా విజయానికి కారణం ఇదేనని చెప్పారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి దేశం ఇదే పంథా అనుసరించాలని కొందరు సూత్రీకరించారు. 

గత నాలుగేళ్లుగా చైనా ఈ వ్యూహాన్ని అనుసరిస్తోందని కొందరు నెటిజన్లు వెల్లడించారు. 2019లోనే షాంఘాయ్ ఎయిర్‌పోర్టులో ఇలాంటి మెషీన్‌ను చూసినట్టు ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. పర్యాటకులకు తెలిసిన భాషల్లో సూచనలు ఇచ్చే యంత్రాలు చైనా వీధుల్లోనూ దర్శనమిస్తాయని కొందరు చెప్పుకొచ్చారు. నేపాల్ నుంచి రోడ్డు మార్గంలో చైనాకు వెళ్లేటప్పుడు ఇలాంటి మెషీన్లు అనేకం చూడొచ్చని తెలిపారు.

More Telugu News