Cyber Crime: ఇద్దరు సైబర్ కేటుగాళ్లను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు

  • అమీర్ పేటకు చెందిన మహిళ ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు
  • పోలీసుల అదుపులో హర్యానాకు చెందిన హిమాన్షు, ప్రవీణ్ 
  • ఆన్ లైన్ ప్రకటనలతో అమాయకులకు గాలం
  • నకిలీ పత్రాలతో తెరిచిన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ
Hyderabad Cyber Crime police arrest two fraudsters

హర్యానాకు చెందిన ఇద్దరు సైబర్ మోసగాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ ఇన్వెస్ట్ మెంట్ పేరిట అమాయకులకు టోపీ వేస్తున్న హిమాన్షు (30), ప్రవీణ్ (26) అనే కేటుగాళ్లను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పాన్ కార్డులతో వేర్వేరు సంస్థల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి, ప్రజలను మోసగిస్తున్న విషయం వెల్లడైంది. 

హిమాన్షు, ప్రవీణ్... ఆన్ లైన్ లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు అని, ఆన్ లైన్ లో పెట్టుబడులు అని గాలం విసిరేవారు. ఎవరైనా వీరి ప్రకటనలకు స్పందిస్తే... నకిలీ పత్రాలతో తెరిచిన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయించుకునేవారు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయేవారు. అమీర్ పేటకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో వారి మోసాలకు తెరపడింది. 

ఆన్ లైన్ లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు, పెట్టుబడులు అంటూ  నమ్మించి తన నుంచి రూ.4.75 లక్షలు బదిలీ చేయించుకున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు చెప్పిన ఖాతాలకు డబ్బును బదిలీ చేసిన తర్వాత మోసపోయినట్టు గుర్తించానని వెల్లడించారు. 

మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు... హిమాన్షు, ప్రవీణ్ లను అరెస్ట్ చేశారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.6 లక్షలను స్తంభింపజేశారు. వారి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, బ్యాంకు చెక్ బుక్స్, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 

వీరిద్దరూ దేవేందర్ పాంచల్ అనే వ్యక్తితో కుమ్మక్కై ఆన్ లైన్ నేరాలకు పాల్పడినట్టు వెల్లడైంది. ఢిల్లీకి చెందిన దేవందర్ పాంచల్ పరారీలో ఉన్నాడు. కాగా, హిమాన్షు, ప్రవీణ్ రుచికా ఇన్ఫో సిస్టమ్స్ పేరిట ఐసీఐసీఐ బ్యాంకులో కరెంట్ ఖాతా తెరిచి రూ.2.5 కోట్లకు టోకరా వేసినట్టు గుర్తించారు.

More Telugu News