Chandrababu: ఐదేళ్లు అలుపెరగక పోరాడిన అమరావతి రైతులకు హ్యాట్సాఫ్: చంద్రబాబు

Chandrababu Sankranthi Speech At Mandadam
  • ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడా, ఎవరూ చేయరని వ్యాఖ్య
  • తెలుగుజాతిని నెంబర్ వన్ గా మార్చడమే టీడీపీ జనసేన ధ్యేయమని వెల్లడి
  • ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వస్తున్నాయన్న మాజీ ముఖ్యమంత్రి
  • అమరావతి ప్రాంతం మందడంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
తెలుగు దేశం - జనసేన కోసం కాదు, తెలుగు జాతి భవిష్యత్తు కోసం ఆలోచించాలని, ఈ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సంకల్పం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈమేరకు రాజధాని గ్రామం మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఆయన జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌తో కలిసి పాల్గొన్నారు. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజధాని కోసం అమరావతి రైతులు ఐదేళ్లుగా అలుపెరగకుండా పోరాడుతున్నారని ఆయన మెచ్చుకున్నారు. వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా, ఎవరూ మూడు రాజధానులు ఏర్పాటు చేయరని చెప్పారు. అధికారంలోకి రాకముందు ఇదే పెద్ద మనిషి (జగన్) అమరావతే రాజధాని అని చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి మూడు రాజధానులని ప్రజలను మోసం చేశాడన్నారు.

ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లది మాత్రమే కాదని, రాష్ట్రంలోని రాష్ట్రంలోని ప్రజలందరిదని టీడీపీ చీఫ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని చెప్పారు. ఏపీ పౌరులు ఏ రాష్ట్రానికి వెళ్లినా, ఏ దేశానికి వెళ్లినా రాణిస్తున్నారు కానీ మన రాష్ట్రంలో మాత్రం వెనకబడుతున్నారని వివరించారు. 2047 నాటికి తెలుగుజాతిని ప్రపంచంలో నెంబర్ వన్ గా మార్చాలన్నది తెలుగుదేశం, జనసేన ధ్యేయమని, ఇది జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పోలీసులు ఇప్పటికైనా మారాలని హితవు పలికారు. దుర్మార్గుడి చేతిలో బలైపోయారని సానుభూతి చూపించారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలని చెప్పారు. ఇప్పటికీ మారకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే మిమ్మల్ని మారుస్తారని హెచ్చరించారు. అలాంటి చెడ్డ పేరు మీరు తెచ్చుకోవద్దని చంద్రబాబు పోలీసులకు సూచించారు. 

‘ఈ రోజు పండుగేమో భోగి.. పాలకుడేమో మానసిక రోగి.. ఈ రోగిని వదిలించుకోవాల్సిన బాధ్యత మనందరిదీ’ అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘ఐదేళ్ల పాలనలో ఏ నిర్ణయమైనా పరిశీలించండి. ఇలాంటి నిర్ణయాలు మానసిక రోగులే తప్ప మామూలు వారు ఎవ్వరూ తీసుకోరు. ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వస్తున్నాయి, అందులో ఎవరికీ అనుమానం అక్కర్లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇదే చోట ఘనంగా సంబరాలు చేసుకుందాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో అమరావతి కేంద్రంగా రాజధాని ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ, కర్నూలు నగరాలను అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన పార్టీలు తీసుకుంటాయని హామీ ఇచ్చారు. ఈ మూడు నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసే బాధ్యత తమదని చంద్రబాబు తెలిపారు.


Chandrababu
Mandadam
TDP Jansena
Sankranti Sankalpam
Andhra Pradesh

More Telugu News