Virat Kohli: 14 నెలల తర్వాత నేడు తొలి టీ20 మ్యాచ్ ఆడనున్న కోహ్లీ!. కీలక బ్యాట్స్‌‌మెన్ బెంచ్‌కే పరిమితం!

  • 3వ స్థానంలో విరాట్ కోహ్లీకి నేరుగా చోటు.. తుది జట్టులో చోటు కోల్పోనున్న తిలక్ వర్మ
  • జైస్వాల్ అందుబాటులోకి రావడంతో బెంచ్‌కే పరిమితం కానున్న శుభ్‌మాన్ గిల్
  • ఇద్దరు స్పినర్లతో ఆడితే మూడవ పేసర్‌గా అవేశ్ ఖాన్‌కు చోటు దక్కే ఛాన్స్
  • నేడు ఇండోర్ వేదికగా రెండవ టీ20లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనున్న భారత్
Virat Kohli will play his first T20 match after 14 months and Subhman Gill to the bench

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ దాదాపు 14 నెలల తర్వాత నేడు (ఆదివారం) తొలి టీ20 మ్యాచ్ ఆడబోతున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలిలో జరిగిన తొలి మ్యాచ్‌లో వ్యక్తిగత కారణాలతో దూరమైన కోహ్లీ నేటి మ్యాచ్‌లో ఆడడం ఖాయమైంది. దీంతో జట్టు బ్యాటింగ్ లైనప్‌లో కొన్ని మార్పులు అనివార్యమవనున్నాయి. మొదటి మ్యాచ్‌లో తిలక్ వర్మ బ్యాటింగ్ చేసిన 3వ నంబర్ స్థానంలో కింగ్ బ్యాటింగ్ చేయడం దాదాపు ఖాయమైనట్టే. ఇక గొంతు సమస్య కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ తిరిగి ఇండోర్ మ్యాచ్‌ ఆడడం దాదాపు ఖాయమైంది. ఈ విషయాన్ని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇప్పటికే నిర్ధారించడంతో ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మొదటి మ్యాచ్‌లో జైస్వాల్ స్థానంలో బ్యాటింగ్‌ చేసిన శుభ్‌మాన్ గిల్ ఈ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం కానున్నాడు. మొదటి మ్యాచ్‌లో 12 బంతుల్లోనే 23 పరుగులు చేసినప్పటికీ రోహిత్‌తో జైస్వాల్ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయనున్నాడు.

ఇక బౌలింగ్ విభాగానికి వస్తే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చనే అంచనాలున్నాయి. మొహాలీ మైదానం పెద్దగా ఉంటుంది కాబట్టి మొదటి మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లుతో ఆడినప్పటికీ.. ఇండోర్‌లో బౌండరీలు చిన్నవిగా ఉండడంతో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. మూడవ పేసర్‌గా అవేశ్ ఖాన్‌, స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను ఆడించే అవకాశాలున్నాయి. ఇక మొదటి మ్యాచ్‌లో శివమ్ దూబే ఆల్ రౌండ్ ప్రదర్శన చేయడంతో సంజూ శాంసన్ జట్టులో చోటు కోసం మరింతకాలం వేచిచూడక తప్పేలా కనిపించడం లేదు. టీమిండియా మొదటి మ్యాచ్‌ టీమ్‌నే కొనసాగిస్తుందనే అంచనాలు ఉన్నప్పటికీ ప్రయోగాలు చేపట్టే అవకాశం లేకపోలేదని విశ్లేషణలు కూడా ఉన్నాయి. కాగా మొహాలీ టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ సునాయాసంగా విజయం సాధించింది. రెండవ మ్యాచ్‌నూ దక్కించుకొని సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. 

2వ టీ20కి తుది జట్టు అంచనా ఇదే..
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్/అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్.

More Telugu News