jupalli krishna rao: కైట్ ఫెస్టివల్‌కు 15 లక్షలమంది వస్తారని అంచనా: తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు

  • 16 దేశాల నుంచి 40 మంది పర్యాటకులు, ఇతర రాష్ట్రాల నుంచి కైట్ ఫ్లయర్స్ వచ్చినట్లు తెలిపిన జూపల్లి
  • అందరినీ భాగస్వాములను చేయడం కోసం కైట్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామన్న మంత్రి
  • ఏ పండుగ అయినా అందరూ పాల్గొనాలని పిలుపు
Jupalli Krishna Rao says 15 lakh people may come to kite fest

తెలంగాణ కైట్ ఫెస్ట్‌కు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మూడు రోజుల పాటు ఈ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. కైట్ ఫెస్ట్‌పై మంత్రి మాట్లాడుతూ... 16 దేశాల నుంచి 40 మంది పర్యాటకులు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది కైట్ ఫ్లయర్స్ వచ్చినట్లు తెలిపారు. కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చిన సందర్భంలో ఈ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుంటామని... కానీ ఇప్పుడు గ్రామాల్లో ఆ సందడి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.

  అందరినీ భాగస్వాములను చేయడం కోసమే కైట్ ఫెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు, వచ్చే ఏడాది నుంచి మండలాల్లో కూడా కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేళ్లు కైట్ ఫెస్టివల్‌కి గ్యాప్ వచ్చిందని తెలిపారు. రానున్న రోజుల్లో పిల్లలకు ఆసక్తి కలిగే కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతామన్నారు. ఏ పండగ అయినా అందరూ పాల్గొనాలన్నారు. తెలంగాణ ప్రాముఖ్యతని ప్రపంచం అంతటా వ్యాపించేలా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. మన వద్ద అన్ని రకాల సంపద ఉందని... మన గొప్పదనాన్ని చాటుకోవాలన్నారు. పర్యాటకులను రప్పించి ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు.

More Telugu News