Sajjala Ramakrishna Reddy: జులైలో జీతాలు పెంచుతాం... అంగన్వాడీలు సమ్మె విరమించాలి: సజ్జల

  • ఏపీలో కొన్ని వారాలుగా అంగన్వాడీల సమ్మె
  • ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ అంగన్వాడీల డిమాండ్
  • ఉద్యోగుల పట్ల ప్రభుత్వం పూర్తి సానుభూతితో ఉందన్న సజ్జల
Sajjala appeals Anganwadi workers for calls off strike

ఏపీలో ఓవైపు అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తుండగా, మరోవైపు మున్సిపల్ కార్మికులు కూడా డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తమ ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల సానుభూతి ఉందని తెలిపారు. జులైలో అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా వేతనాలు పెంచుతామని వెల్లడించారు. యూనియన్లు ఇప్పటికైనా ఆలోచించి సమ్మె విరమించుకోవాలని సజ్జల పిలుపునిచ్చారు. 

"అంగన్వాడీ కార్యకర్తలకు నేరుగా విజ్ఞప్తి చేస్తున్నాం... ఇది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పూర్తిగా పేదల పక్షపాత ప్రభుత్వం. ఉద్యోగుల పట్ల, ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల పట్ల మరింత ఆదరణ కలిగిన ప్రభుత్వం. మీరు కూడా ప్రభుత్వంలో భాగమే. మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించకపోతే... సమాజానికి అందాల్సిన సేవలు అందవు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. వెంటనే సమ్మెను విరమించాలని యూనియన్లకు, యూనియన్ల ప్రతినిధులకు, అంగన్వాడీ కార్యకర్తలకు, సహాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం" అంటూ సజ్జల ప్రభుత్వ గళం వినిపించారు.

More Telugu News