Jacinda Ardern: నిశ్చితార్థం చేసుకుని, బిడ్డకు జన్మనిచ్చి... ఇన్నాళ్లకు పెళ్లి చేసుకున్న న్యూజిలాండ్ మాజీ ప్రధాని

New Zealand former PM Jacinda Ardern ties the knot
  • 2014 నుంచి క్లార్క్ గేఫోర్డ్ తో ప్రేమలో ఉన్న జెసిండా ఆర్డెన్
  • 2019లో నిశ్చితార్థం.. కరోనా సంక్షోభం కారణంగా పెళ్లి వాయిదా
  • గతేడాది న్యూజిలాండ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆర్డెన్
న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెన్ ది ఒక విచిత్ర గాథ. పదేళ్లుగా క్లార్క్ గేఫోర్డ్ తో రిలేషన్ షిప్ లో ఉన్న ఆమె నాలుగేళ్ల కిందటే నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ లోపు ఆమె బిడ్డను కూడా కన్నారు. పెళ్లి చేసుకోవడానికి ఇప్పటికి వీలైంది. 

అసలేం జరిగిందంటే... జెసిండా ఆర్డెన్, క్లార్క్ గేఫోర్డ్ ప్రేమించుకున్నారు. ఇరువురు 2014 నుంచి కలిసి ఉంటున్నారు. 2019లో వీరి నిశ్చితార్థం జరిగింది. 2022లో  పెళ్లి చేసుకోవాలని భావించగా, కరోనా సంక్షోభం తదనంతర పరిస్థితుల్లో అది సాధ్యం కాలేదు. అప్పటికి ఆమె న్యూజిలాండ్ ప్రధానిగా ఉన్నారు. 

కరోనా సంక్షోభంతో న్యూజిలాండ్ ఆర్థికవ్యవస్థ దిగజారుతున్న వేళ తాను పెళ్లి చేసుకోవడం సబబు కాదని భావించి, ఆమె తన జీవితంలోని అత్యంత కీలక ఘట్టాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడం, బిడ్డకు జన్మనివ్వడం వంటి పరిణామాలు జరిగాయి. ఐక్యరాజ్యసమితి సమావేశానికి ఆమె చంటిబిడ్డతో రావడంతో జెసిండా ఆర్డెన్ గురించి అందరిలోనూ ఆమె వ్యక్తిగత జీవితంపై ఆసక్తి ఏర్పడింది. 

ఇక, గతేడాది అనూహ్యరీతిలో జెసిండా ఆర్డెన్ న్యూజిలాండ్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడామె మరోసారి వార్తల్లోకెక్కారు. నిశ్చితార్థం చేసుకున్న నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్నారు. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ కు 325 కి.మీ దూరంలోని హాక్ బే వద్ద క్లార్క్ గేఫోర్డ్ ను వివాహమాడారు. ఆర్డెన్, గేఫోర్డ్ దంపతులకు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు.
Jacinda Ardern
Wedding
Clark Gayford
Former Prime Minister
New Zealand

More Telugu News