Uttam Kumar Reddy: గత పాలకులు అప్పులు ఎక్కువగా చేసినా ఫలితం దక్కలేదు... అందుకే అవసరం మేర ఖర్చులు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం
  • వచ్చే జూన్ నాటికి 50వేలు, డిసెంబర్ నాటికి లక్షన్నర ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశం
  • రానున్నది వేసవి కాలం కాబట్టి చెరువుల పూడిక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశం
Uttam Kumar Reddy review on water projects

నీటిపారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కువగా చేశారని, అయినా అందుకు తగిన ప్రతిఫలం దక్కలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వచ్చే జూన్ నాటికి కొత్తగా 50 వేలు, డిసెంబర్ నాటికి నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత పాలకులు చేసిన ఖర్చుకు తగిన ఫలితం రాలేదని... అందుకే అవసరం మేర ఖర్చులు చేయాలని అధికారులను ఆదేశించారు.

అవసరమైన నిధులు ఖర్చు చేసి కొత్త ఆయకట్టు సృష్టించాలన్నారు. కొత్తగా ప్రాజెక్టులలో నీరందించే విషయంలో అడ్డంకులన్నీ అధిగమించి సకాలంలో నీరు అందించాలన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో సుమారు 18 ప్రాజెక్టులలో పలు ప్యాకేజీల కింద ఈ ఏడాది చివరి నాటికి నీరు అందిస్తామన్నారు. రాబోయే అయిదేళ్లలో ఏ ప్రాజెక్టులలో కొత్త ఆయకట్టు ఎంత ఇస్తున్నామన్న సమాచారం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చే విషయంలో ఉన్న ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ఆయకట్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.

రానున్నది వేసవి కాలం కాబట్టి రాష్ట్రంలో చెరువుల పూడిక కార్యక్రమాలు, జంగిల్ కటింగ్ చేపట్టాలని అధికారులకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి అన్ని చెరువుల పనులు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు కోయినా ప్రాజెక్టు నుంచి 100 టీఎంసీల నీరు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ఖర్చును మహారాష్ట్రకు అందిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైనట్లు చెప్పారు. కాళేశ్వరం అందుబాటులో లేకపోవడంతో ఎస్సారెస్పీ స్టేజ్-2 నీళ్లు ఇవ్వలేకపోతున్నామన్నారు.

More Telugu News