Safety measures: పండుగకు ఊరెళుతున్న వారికి తెలంగాణ పోలీసుల సూచనలు

Hyderabad Police shares crucial safety measures for residents heading home
  • సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకునేందుకు జాగ్రత్తలు
  • చుట్టుపక్కల ఇళ్లల్లోని వారికి మీ ప్రయాణం సంగతి చెప్పాలని సూచన
  • ఇంట్లో వదిలి వెళ్లే నగలు, డబ్బు వివరాలపై బహిరంగంగా చర్చించ వద్దని హితవు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలామంది సిటీ వాసులు సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. హైవేలు ఇప్పటికే రద్దీగా మారగా హైదరాబాద్ రోడ్లపై వాహనాల రద్దీ తగ్గిపోయింది. బంధువుల మధ్య పండుగను జరుపుకునేందుకు వెళుతున్నామనే సంతోషం వెంటే దొంగల భయం మనసులో ఓ మూల వేధిస్తూనే ఉంటుంది. అయితే, ఈ భయం అక్కర్లేదని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఇంటికి తాళం పెట్టి సొంతూళ్లకు వెళ్లే వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవచ్చని అంటున్నారు. 

పోలీసులు చెప్పిన జాగ్రత్తలు ఇవే..
  • ఇరుగుపొరుగు వారిలో మీతో క్లోజ్ గా ఉండే వారికి మీ ప్రయాణం వివరాలు చెప్పండి. ఎప్పుడు వెళుతున్నది, ఎప్పుడు తిరిగొచ్చేది చెప్పి మీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచాలని కోరండి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే మీకు ఫోన్ చేసి చెప్పాలని సూచించండి.
  • ప్రయాణం నేపథ్యంలో ఇంట్లో వదిలివెళ్లే విలువైన ఆభరణాల వివరాలు కానీ వస్తువుల వివరాలపై కానీ బహిరంగంగా చర్చించుకోవడం చేయొద్దు. నగలు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో జాగ్రత్తగా దాచిపెట్టండి. బయటకు కనిపించకుండా జాగ్రత్త పడండి.
  • వీలైతే ఇంట్లో సీసీటీవీ కెమెరాను అమర్చుకోవడం మంచిది. దీనివల్ల మీరు ఎక్కడున్నా మొబైల్ ఫోన్ తో ఇంటిపై ఓ కన్నేసి ఉంచవచ్చు. దొంగల భయం లేకుండా నిశ్చింతగా ఉండొచ్చు.
  • ఇంట్లోని బీరువా తాళాలు మీతోనే తీసుకెళ్లండి. ఇంటికి తాళం వేశాం కదా అని నిర్లక్ష్యంతోనో ఎక్కడైనా పోతాయనే భయంతోనో ఇంట్లో వదిలి వెళ్లొద్దు.
  • ఇంటికి వేసేందుకు మంచి నాణ్యత కలిగిన తాళం ఉపయోగించండి. డోర్ కు వేసిన తాళం కనిపించకుండా పై నుంచి కర్టెన్ వేయడం శ్రేయస్కరం. ఇంట్లో ఎవరూ లేరనే విషయం చూసే వాళ్లకు ఇట్టే తెలిసిపోకుండా ఇది ఉపయోగపడుతుంది.
  • మెయిన్ హాల్ లో ఓ లైట్ వేసి ఉంచడం ద్వారా ఇంట్లో ఎవరైనా ఉన్నారనే భ్రమ కలిగించవచ్చు. కొంతవరకు ఇది దొంగలను మీ ఇంటికి దూరం పెడుతుంది.
Safety measures
Sankranti Festival
Hyderabad Police
Village Tour
Thieves

More Telugu News