Dhruv Jurel: కిట్ కోసం అమ్మ బంగారు గొలుసు అమ్మింది.. నాన్న అప్పు చేసి బ్యాట్ కొనిచ్చాడు: ఎమోషనల్‌గా స్పందించిన ధృవ్ జురెల్

  • ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు తొలిసారి ఎంపికవ్వడంపై స్పందించిన యువ క్రికెటర్
  • టీమిండియాకి సెలెక్ట్ అయినట్టు స్నేహితులు చెప్పారని తెలిపిన జురెల్
  • రోహిత్, కోహ్లీ ఆడే భారత జట్టుకు ఎంపికయ్యానని తెలిసి కుటుంబమంతా భావోద్వేగానికి గురైందని వెల్లడి
Mother Sold Gold Chain and Father Borrowed Rs 800 For Bat sasy Son Dhruv Jurel

ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరగనున్న 5 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి 2 టెస్టులకు ఎంపికైన యువ బ్యాట్స్‌మెన్-వికెట్ కీపర్ ధృవ్ జురెల్ నేపథ్యం స్ఫూర్తిదాయకంగా ఉంది. సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా మెరుగుపడి తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికవ్వడంపై అతడు భావోద్వేగంతో స్పందించాడు. తన కుటుంబ నేపథ్యాన్ని వెల్లడించాడు.

తనకు బ్యాట్ కొనివ్వడానికి నాన్న రూ.800 అప్పు చేశాడని జురెల్ వెల్లడించారు. క్రికెట్ కిట్టు కావాలని తాను మొండిపట్టు పట్టడంతో అమ్మ తన మెడలోని బంగారు గొలుసుని అమ్మిందని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘నేను ఆర్మీ స్కూల్‌లో చదివాను. సెలవుల్లో ఆగ్రాలోని ఏకలవ్య స్టేడియంలో క్రికెట్ క్యాంప్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. దానికి సంబంధించిన ఫారాన్ని కూడా నింపాను. ఈ విషయాన్ని మా నాన్నకు చెప్పలేదు. అయితే ఈ విషయం నాన్నకు తెలిసిపోయింది. కోపంతో నన్ను బాగా తిట్టారు. అయితే కోపం చల్లారిన తర్వాత రూ.800లతో క్రికెట్ బ్యాట్ కొనిచ్చాడు. ఇక నాకు క్రికెట్ కిట్ కావాలని అడిగినప్పుడు రేటు ఎంత ఉంటుందని నాన్న అడిగారు. ఆరు నుంచి ఏడు వేల రూపాయల వరకు ఉంటుందని చెప్పాను. కాసేపు ఆలోచించుకొని క్రికెట్ ఆడడం మానేయమని నాన్న చెప్పారు. కానీ క్రికెట్ కిట్టు కావాలని నేను మొండిపట్టు పట్టాను. బాత్‌రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేశాను. దీంతో మా అమ్మ తన బంగారు గొలుసును అమ్మి నాకు క్రికెట్ కిట్ కొనిచ్చింది’’ అని ధృవ్ జురెల్ తెలిపాడు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

తాను టీమిండియాకు ఎంపికైన విషయం ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందని జురెల్ తెలిపాడు. ఏ జట్టుకు ఎంపికయ్యావని ఇంట్లో వాళ్లు అడగగా..  రోహిత్ భయ్యా, విరాట్ భయ్యా ఆడే భారత జట్టుకు ఎంపికయ్యానని చెప్పానన్నాడు. ఇది విని కుటుంబం మొత్తం భావోద్వేగానికి లోనైందని వివరించాడు. కాగా ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ తొలి 2 రెండు మ్యాచ్‌లకు శుక్రవారం ప్రకటించిన జట్టులో మూడవ ఛాయిస్ కీపర్‌గా ధృవ్ జురెల్‌కు సెలెక్టర్లు చోటు కల్పించిన విషయం తెలిసిందే.

More Telugu News