Amir Hussain Lone: సంకల్ప బలానికి తలవంచిన విధి.. రెండు చేతులు లేకున్నా అద్భుతంగా క్రికెట్ ఆడుతున్న యువకుడు!

  • 8 ఏళ్ల ప్రాయంలో ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఆమిర్ హుస్సేన్ 
  • ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో పారా క్రికెట్‌లోకి
  • మెడ మధ్యలో బ్యాట్ పట్టుకుని అలవోకగా షాట్లు కొడుతున్న 34 ఏళ్ల ఆమిర్
  • పలు అంతర్జాతీయ మ్యాచుల్లో జమ్మూకశ్మీర్ జట్టుకు ప్రాతినిధ్యం
Armless Cricketer Amir Hussain Lone Inspirational Story

ఒకటి కాదు.. ఆ కుర్రాడికీ రెండు చేతులూ లేవు. అయితేనేం.. ఎంచక్కా క్రికెట్ ఆడేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. లక్ష్యానికి తోడైన సంకల్పబలం ముందు విధిని సైతం పాదాక్రాంతం చేసుకున్న ఆ కుర్రాడి పేరు ఆమిర్ హుస్సేన్ లోన్ (34). జమ్మూకశ్మీర్‌కు చెందిన అమీర్ 8 ఏళ్ల ప్రాయంలోనే ఓ ప్రమాదంలో రెండు చేతులూ కోల్పోయాడు. అయితేనేం, అందరిలా కుంగిపోలేదు. చేతులు లేవని బాధపడలేదు.

తనలోని ప్రతిభను గుర్తించిన ఓ ఉపాధ్యాయుడి చొరవతో పారా క్రికెట్‌లోకి వచ్చాడు. మెడ మధ్యలో బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేస్తూ, అలవోకగా షాట్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కాలివేళ్లతో బంతిని పట్టుకుని గిరిగిరా తిప్పి చేత్తో వేసినట్టుగానే బౌలింగ్ వేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు.

జట్టుకు కెప్టెన్ కూడా
బ్యాటింగ్, బౌలింగ్‌లో అపార ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్న ఆమిర్ 2013 నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. ప్రస్తుత జమ్మూకశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు ఆమిరే కెప్టెన్. 2013, 2018లో జాతీయ టోర్నీలో ఆడిన ఆమిర్.. బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దుబాయ్, షార్జా, నేపాల్‌లోనూ మ్యాచ్‌లు ఆడిన ఆమిర్‌కు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అన్నా, సచిన్ టెండూల్కర్ అన్నా చెప్పలేనంత ఇష్ఠం. వారిని కలవాలని కలలుగంటున్న అతడి జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో సినిమా కూడా రాబోతోంది. అన్నీ ఉండి ఏమీ సాధించలేకపోతున్నామని నిరాశలో కూరుకుపోయే యువతకి ఆమిర్ నిలువెత్తు నిదర్శనం. కాదంటారా!

More Telugu News