Winter Storm: అమెరికాలో తీవ్ర మంచు తుపాను.. 2000 విమానాల రద్దు.. ఆలస్యంగా నడుస్తున్న 2,400 విమానాలు

  • ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తున్న వేలాది మంది ప్రయాణికులు
  • తుపాను తీవ్రత కారణంగా కరెంట్ సరఫరాలో తీవ్ర అంతరాయం
  • తూర్పు అమెరికా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న మంచు తుపాను
Heavy storm hit America and due to this effect 2000 flights canceled and 2400 delayed

అగ్రరాజ్యం అమెరికాపై తీవ్ర మంచు తుపాను పంజా విసిరింది. ఈ శీతాకాలపు తుపాను ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రవాణా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా మిడ్‌వెస్ట్, చుట్టు పక్కల రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఏకంగా 2000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 2400 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘ఫ్లైట్‌అవేర్.కామ్’ డేటా స్పష్టం చేసింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

షికాగోలోని ఓ'హేర్ అంతర్జాతీయ విమానాశ్రయం 40 శాతం విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇందులో 36 శాతం విమానాలు ఈ ఎయిర్‌పోర్టుకు రావాల్సి ఉంది. ఇక షికాగో మిడ్‌వే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన, ఇక్కడికి రావాల్సిన 60 శాతం విమాన సర్వీసులు రద్దయ్యాయి. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మిల్వాకీ మిచెల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో పాటు పలు ఎయిర్‌పోర్టులు పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ‘737 మ్యాక్స్ 9 విమానాల’ ల్యాండింగ్‌‌లో ఇబ్బంది కూడా పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడానికి ఒక కారణంగా ఉంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేయాల్సి వస్తోంది.

కరెంట్ కష్టాలు అనుభవిస్తున్న అమెరికన్లు
తీవ్రమైన మంచు తుపాను కారణంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్రమైన అవాంతరాలు ఎదురవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. తీవ్రమైన గాలులు కూడా ఇబ్బందికరంగా మారాయి. శుక్రవారం ఉదయం నాటికి గ్రేట్ లేక్స్, సౌత్‌ ఏరియాలో సుమారు 250,000 ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా కావడం లేదు. ఇల్లినాయిస్‌లో దాదాపు 97,000 మంది చీకటిలో మగ్గుతున్నారు. అత్యంత శక్తిమంతమైన ఈ తుపాను యునైటెడ్ స్టేట్స్ తూర్పు భాగంలో వ్యాపించి ఉందని సీఎన్ఎన్ రిపోర్ట్ పేర్కొంది.

More Telugu News