ashwini Vaishnaw: బుల్లెట్ రైలుపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి కీలక ప్రకటన

  • అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంత భాగం 2026 నాటికి పూర్తవుతుందని వెల్లడి
  • ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో భూసేకరణ దాదాపు పూర్తయిందన్న కేంద్రమంత్రి
  • ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణాలు కూడా పూర్తయినట్లు వెల్లడి
Union Minister Vaishnaw review on bullet train project

అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంత భాగం 2026 నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. గుజరాత్‌లో జరుగుతోన్న వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సూరత్ నుంచి బిలిమోరా వరకు 35 కిలో మీటర్ల దూరం సిద్ధమవుతుందన్నారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

అయితే ఈ ప్రాజెక్టు కచ్చితంగా ఎప్పుడు పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగమైన అహ్మదాబాద్‌లోని సబర్మతి మల్టీ మోడల్ ట్రాన్సుపోర్ట్ హబ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చునని సూచించారు. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలోనూ భూసేకరణ దాదాపు పూర్తయిందన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణాలు పూర్తయినట్లు చెప్పారు.

ప్రయాణికులకు 55 శాతం రాయితీ వస్తోంది

రైలులో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు 55 శాతం రాయితీ సౌకర్యాన్ని పొందుతున్నారని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. సీనియర్ సిటిజన్లకు, మీడియా ప్రతినిధులకు కరోనా ముందునాటి రాయితీని పునఃప్రారంభించాలని వస్తున్న డిమాండ్లపై మంత్రిని ప్రశ్నించగా.. దానికి సూటిగా సమాధానం చెప్పకుండా ఆయనలా పేర్కొన్నారు. ఇప్పటికే భారతీయ రైల్వే ప్రతి ప్రయాణికుడికి వారి ప్రయాణంపై 55 శాతం తక్కువకే ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోందన్నారు. అంటే ఒకచోటు నుంచి మరో చోటుకి టికెట్ ధర 100 రూపాయలు అనుకుంటే, రైల్వేస్ కేవలం 45 రూపాయలే చార్జ్ చేస్తోందని, తద్వారా ప్రతి ప్రయాణికుడికీ 55 శాతం రాయితీ వస్తున్నట్టేనని మంత్రి సూత్రీకరించారు. 

More Telugu News