Supreme Court: సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐ పాత్ర తొలగింపు చట్టంపై... స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు!

  • డిసెంబరు 28న గెజిట్ విడుదల చేసిన కేంద్రం
  • సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ఇకపై సీజేఐ స్థానంలో కేంద్రమంత్రి
  • పాత విధానమే ఉండాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
  • కేంద్రానికి నోటీసులు పంపించగలమన్న సుప్రీంకోర్టు
SC denies to stay on CJI role revoking in CEC and other election commissioners appointment

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) పాత్రను తొలగిస్తూ కేంద్రం డిసెంబరు 28న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐని తొలగించిన కేంద్ర ప్రభుత్వం.... సీజేఐ స్థానంలో ఓ కేంద్రమంత్రి ఉండేలా చట్టం రూపొందించింది. కేంద్రం చేసిన చట్టం ప్రకారం... సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి, లోక్ సభలో విపక్ష నేతతో పాటు ఒక కేంద్రమంత్రి కూడా సభ్యుడిగా ఉంటారు. 

కాగా, సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐ పాత్ర లేకపోతే, పారదర్శకత లోపిస్తుందని, పాత విధానాన్నే పునరుద్ధరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సర్వ వ్యవస్థలను కేంద్రం తన గుప్పిట్లో ఉంచుకునే చర్యల్లో ఇదొకటని పిటిషనర్ పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయంపై స్టే ఇవ్వాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐ పాత్రను తొలగించడంపై తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది."మేం స్టే ఇవ్వబోవడంలేదు. పార్లమెంటులో చేసిన శాసనంపై మేం స్టే ఇవ్వలేం" అంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే, ఈ అంశంలో వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి, ఇతరులకు నోటీసులు ఇవ్వగలమని స్పష్టం చేసింది. అలాగే, ఏప్రిల్ లోగా సమాదాం ఇవ్వాలని కేంద్రానికి సుప్రీం నోటీసులు ఇచ్చింది.

More Telugu News