Sankranti 2024: సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జామ్.. ఖాళీ అవుతున్న నగరం

  • పంతంగి టోల్‌ప్లాజా వద్ద నిలిచిపోయిన వందలాది వాహనాలు
  • 10 గేట్లు తెరిచి వాహనాలను పంపిస్తున్న అధికారులు
  • నిర్మానుష్యంగా మారుతున్న హైదరాబాద్ రోడ్లు
Traffic Jam On Hyderabad Vijayawada Highway

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఘనంగా జరుపుకునే సంకాంత్రి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు వెళ్తున్న వారితో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. వందలాది వాహనాలు ఒకేసారి రోడ్డెక్కడంతో ట్రాఫిక్ నత్తనడకన సాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులుతీరాయి. అయితే, 95శాతం వాహనాలకు ఫాస్టాగ్ పూర్తికావడంతో టోల్‌ప్లాజా వద్ద వాహనాల కదలికలో వేగం పుంజుకుంది. మరోవైపు, ట్రాఫిక్‌ను వీలైనంత వేగంగా క్లియర్ చేసేందుకు టోల్‌ప్లాజాలోని 10 గేట్లను ఎత్తారు.

సాధారణ రోజుల్లో ఈ టోల్‌ప్లాజా మీదుగా రోజుకు 30 వేల వరకు వెళ్లే వాహనాల సంఖ్య సంక్రాంతి రోజుల్లో 60 నుంచి 70 వేల వరకు ఉంటుందని టోల్‌ప్లాజా అధికారులు తెలిపారు. ఏపీ వాసులు పెద్ద ఎత్తున తమ ఊళ్లకు వెళుతుండడంతో హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నగరంలో ట్రాఫిక్ జామ్‌లు కనిపించడం లేదు. ప్రతి కూడలిలో వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి.

More Telugu News