Jeevan Reddy: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావు: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

  • తప్పుడు ప్రచారంతోనే బీఆర్ఎస్‌కు ఆ మాత్రం ఓట్లయినా వచ్చాయన్న జీవన్ రెడ్డి
  • ఓడిపోయినా అంగీకరించే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదని విమర్శలు
  • కేటీఆర్ ఆత్మస్తుతి, పరనింద మానుకోకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరిక
  • బీజేపీ కాచుకొని కూచుందన్న జీవన్ రెడ్డి
MLC Jeevan Reddy warns brs over lok sabha election

తప్పుడు ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఆ మాత్రం ఓట్లయినా పడ్డాయని... ఓడిపోయినప్పటికీ అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు లేరని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ ఆత్మస్తుతి, పరనింద నుంచి బయటపడాలని హితవు పలికారు. కేటీఆర్ అందులోంచి బయటకు రాకపోతే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. బీఆర్ఎస్‌కు పరోక్ష మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇప్పటికే కాచుకొని కూచుందన్నారు. కేసీఆర్ హయాంలో ప్రచారం తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. అందుకే ఓడిపోయారని... అయినా వారికి జ్ఞానోదయం కలగడం లేదన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. బీఆర్ఎస్ తన అభ్యర్థులను మార్చితో సరిపోదన్నారు. అయినా ప్రజలు ఆ పార్టీ అధినాయకుడిని మార్చడానికి సిద్ధమయ్యారన్నారు. గిరిజనులను గత ప్రభుత్వం నిండా ముంచిందని.. అందుకే వారు కాంగ్రెస్ వైపుకు వచ్చారని పేర్కొన్నారు. దళితబంధు, బీసీబంధు అంటూ ఎన్నికలకు ముందు హడావుడి చేశారని.. దీనిని ప్రజలు గుర్తించారన్నారు. మిషన్ భగీరథలో పెద్ద కుంభకోణం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పెద్ద బోగస్ అని... కమీషన్ల కోసమే అలా చేశారని ఆరోపించారు.

More Telugu News