padi koushik reddy: కోదండరాం తప్పుడు ప్రచారం చేశారు... మేం ఉద్యోగాలిస్తేనే కదా, మీరు వాళ్లకి జీతాలిచ్చారు!: పాడి కౌశిక్ రెడ్డి

  • జేఏసీ పేరుతో కోదండరాం తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణ
  • రేవంత్ ప్రభుత్వం జనవరి 4న జీతాలు ఇచ్చింది తమ హయాంలో ఉద్యోగాలు ఇచ్చిన వారికేనని వ్యాఖ్య
  • పదేళ్ల కాలంలో లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్న పాడి కౌశిక్ రెడ్డి
Padi Kaushik Reddy fires at kodandaram and congress

ఎన్నికల సమయంలో జేఏసీ పేరుతో కోదండరాం తప్పుడు ప్రచారం చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోదండరాం వంటి వారు ఏమని ప్రచారం చేశారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని వారు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తాము ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని వారు చెప్పారని.. కానీ ఈ జనవరి 4వ తేదీన లక్షా అరవై వేల అరవై మూడు మందికి తాము జీతాలు ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని... వారందరికీ ఉద్యోగాలు ఇచ్చింది మేం కాదా? అని ఆయన ప్రశ్నించారు. మేం ఉద్యోగాలు ఇచ్చినందుకే మీరు ఇప్పుడు వారికి వేతనాలు వేశారన్నారు. అబద్ధపు పునాదులపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు.

నిజం గడపదాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందన్న విధంగా కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలు నమ్మి మోసపోయారన్నారు. డిసెంబర్ 2024 వరకు రెండు లక్షల ఉద్యోగాలను ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని... కానీ తమ హయాంలో వచ్చిన 2 లక్షల ముప్పై వేలకు పైగా ఉద్యోగాలకు తోడు మీరూ మరో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ సమైక్య ఏపీలో పదేళ్ల కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 24వేలు అని, అందులోనూ తెలంగాణకు ఇచ్చింది పదివేలు మాత్రమే అన్నారు. కానీ బీఆర్ఎస్ రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఇది కేసీఆర్ గొప్పతనమని గుర్తించాలన్నారు. అలాగే, పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పది లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలను ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడే లేదని తెలిపారు.

More Telugu News