Nayanthara: నయనతార సినిమాను తొలగించిన నెట్ ఫ్లిక్స్

  • వివాదాల్లో కూరుకుపోయిన నయనతార 'అన్నపూర్ణి' చిత్రం
  • హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా ఉందంటూ విమర్శలు
  • ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసిన నెట్ ఫ్లిక్స్
Netflix Removes Film Annapoorani After Backlash

దక్షిణాది అగ్ర సినీ నటి నయనతార తాజాగా నటించిన 'అన్నపూర్ణి' వివాదాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ పోలీస్ కేసు కూడా నమోదయింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసింది. అయితే, సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో... ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ తొలగించింది. 

ఈ చిత్రంలో హిందూ పూజారి కూతురు (నయనతార) గొప్ప చెఫ్ కావాలనుకుంటుంది. ఇందులో భాగంగా ఆమె జాతీయ స్థాయి కుకింగ్ పోటీలో పాల్గొంటుంది. ఈ పోటీలో ఆమె మాంసాహారాన్ని వండుతుంది. ఈ కథాంశం హిందువుల మనోభావాలను గాయపరిచింది. సినిమాపై పలు చోట్ల హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

గత బుధవారం ముంబైలోని నెట్ ఫ్లిక్స్ కార్యాలయం ఎదుట ఆ సంస్థకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. నెట్ ఫ్లిక్స్ కు వ్యతిరేకంగా వీరు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ నుంచి 'అన్నపూర్ణి' సినిమా మాయమయింది.

More Telugu News