Most Powerful Passports: ప్రపంచంలో శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితా ఇదే.. భారత్, పాకిస్థాన్ ఏయే స్థానాల్లో నిలిచాయంటే..!

  • అగ్రస్థానంలో నిలిచిన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్
  • 80వ స్థానంలో నిలిచిన భారత్.. 101వ ర్యాంకులో నిలిచిన పాకిస్థాన్
  • తాజా ర్యాంకులతో ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్’ జాబితా విడుదల
list of most powerful passports in the world and India ranks at 80

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్’ వెల్లడించింది. 2024కు సంబంధించిన ఈ సూచీలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ అగ్రస్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టు ఉంటే వీసా లేకుండానే 194 దేశాలకు ప్రయాణించవచ్చునని రిపోర్ట్ పేర్కొంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డేటా ఆధారంగా దేశాల ర్యాంకులను నిర్ణయించారు.

శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో గత ఐదేళ్లుగా జపాన్, సింగపూర్‌లు మొదటి స్థానంలో నిలుస్తున్నాయి. అయితే ఈ త్రైమాసికంలో యూరోపియన్ దేశాల ర్యాంకులు మెరుగయ్యాయి. ఇక 193 దేశాలకు వీసా రహిత ప్రయాణ అనుమతి ఉన్న ఫిన్లాండ్, స్వీడన్, దక్షిణకొరియా పాస్‌పోర్టులు రెండవ స్థానంలో నిలిచాయి. ఇక ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ దేశాలు మూడవ ర్యాంకులో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌తో 192 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు.

భారత పాస్‌పోర్టుకు 80వ ర్యాంకు..

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ పాస్‌పోర్టుకు 80వ ర్యాంక్ దక్కింది. ఇండియన్ పాస్‌పోర్టుతో 62 దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని చేయవచ్చు. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ సహా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్‌తో సమానంగా భారత్ 80వ ర్యాంకులో నిలిచింది. ఇక పొరుగునే ఉన్న పాకిస్థాన్ 101వ స్థానంలో వుంది. కేవలం 28 దేశాలకు మాత్రమే వీసా రహిత ప్రయాణ అవకాశమున్న ఆఫ్ఘనిస్థాన్ ఈ జాబితాలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 29 దేశాలకు ప్రయాణ అవకాశమున్న సిరియా చివరి నుంచి రెండవ స్థానంలో ఉంది. ఇక ఇరాక్ పాస్‌పోర్ట్‌తో 31 దేశాలకు, పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌తో 34 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు.

More Telugu News