IMD: ఇకపై ‘పంచాయతీ వాతావరణ సేవ’.. భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన

  • వచ్చేవారం నుంచి గ్రామీణ స్థాయిలో వాతావరణ అంచనాలు విడుదలవుతాయని వెల్లడి
  • ‘పంచాయతీ వాతావరణ సేవ’ ద్వారా సమాచారం  పొందవచ్చని తెలిపిన ఐఎండీ డైరెక్టర్‌
  • ఐఎండీ 150వ వార్షికోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి కొత్త సేవలు
Weather information for every village in the Country says IMD

భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. వాతావరణ పరిస్థితులను చిన్నకారు రైతులు గ్రామీణ స్థాయిలో సైతం తెలుసుకునేందుకు వీలుగా మొత్తం 12 భారతీయ భాషల్లో గ్రామపంచాయతీ స్థాయిలో వాతావరణ అంచనాలను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. వచ్చే వారం నుంచి ఇంగ్లిష్, హిందీతో పాటు ఇతర భాషల్లో సమాచారాన్ని అందించనున్నట్టు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర గురువారం తెలిపారు. 

‘పంచాయతీ వాతావరణ సేవ’ ద్వారా సమాచారాన్ని పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. తుపానుల వంటి తీవ్రమైన హెచ్చరికలు, గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం, గాలుల వేగం వంటి వివరాలను తెలుసుకోవచ్చని వివరించారు. దేశంలో ప్రతి గ్రామంలో తక్కువలో తక్కువ ఐదుగురు రైతులకు నేరుగా వాతావరణ రిపోర్టులు పంపించాలన్నదే తమ లక్ష్యమని మహాపాత్ర వెల్లడించారు. వాతావరణానికి సంబంధించిన సూచనలు, సలహాలను మండలాల స్థాయి నుంచి గ్రామాల స్థాయికి తీసుకెళ్లడం సాధ్యమైందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రానున్న ఐదేళ్లలో రాడార్ల సంఖ్య 39 నుంచి 86కి పెరుగుతుందని, రాష్ట్రాలతో కలిసి ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాలను పెంచుతున్నామని తెలిపారు.

‘ప్రతి చోటా వాతావరణం.. ఇంటింటికీ వాతావరణం’ పేరిట అందించనున్న కొత్త సేవలో ప్రాంతం పేరు, పిన్‌కోడ్‌, లేదా అక్షాంశ రేఖాంశాలను తెలిపి దేశంలో ఏ మూలన ఉన్నవారైనా తమ సెల్‌ఫోన్‌లో యాప్‌ ద్వారా వారం రోజుల వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చని మహాపాత్ర సూచించారు. కొన్ని గంటల్లో వాతావరణం ఎలా మారబోతోందనే విషయాన్ని కూడా గమనించవచ్చునని ఆయన తెలిపారు. వాతావరణ సమాచారాన్ని సరైన రీతిలో వాడుకుంటే వర్షాధార ప్రాంతాల్లోని చిన్నరైతులు రూ.12,500 వరకు లబ్ధి పొందవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. 

భారత్‌లో క్రీడా, పారిశ్రామిక రంగాలు వాతావరణ సమాచారాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడంలేదని మహాపాత్ర వ్యాఖ్యానించారు. నిర్మాణ పనులు, పెళ్లిళ్ల విషయంలో కూడా ప్రజలు వాతావరణ వివరాలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఐఎండీ 150వ వార్షికోత్సవాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయి. ఏడాదిపాటు కొనసాగనున్న ఈ ఉత్సవాలకు సంబంధించిన విశేషాలను ఓ జాతీయ మీడియా సంస్థతో మహాపాత్ర పంచుకున్నారు. వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరూ రోజువారీ కార్యకలాపాల్లో ఉపయోగించుకోవాలనేది తమ ఉద్దేశమని, పిడుగుపాటు అలర్ట్‌కు సంబంధించి ఇప్పుడు 1,200 నగరాలు, పట్టణాల్లో సేవలు అందిస్తున్నామని ఆయన ప్రస్తావించారు.

More Telugu News