Lathasri: చాలా సినిమాలకి డబ్బులు ఎగ్గొట్టారు: నటి లతాశ్రీ

  • 90లలో బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న లతాశ్రీ 
  • నటిగా తన ప్రయాణం గురించిన ప్రస్తావన
  • చెల్లెలు పాత్రలు ఎక్కువగా చేశానని వ్యాఖ్య  
  • చాలా అవకాశాలు పోగొట్టుకున్నానని వెల్లడి 
Lathasri Interview

1990లలో కేరక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాలలో లతాశ్రీ నటించారు. 'ముద్దుల మేనల్లుడు' .. 'అబ్బాయిగారు' .. ' అల్లరోడు' .. ' ఆ ఒక్కటి అడక్కు' .. 'యమలీల' వంటి సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తరువాత నిదానంగా ఆమె నటనకు దూరమయ్యారు. అయితే ఆమె చేసిన కొన్ని పాత్రల కారణంగా ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. 

తాజా ఇంటర్యూలో లతాశ్రీ మాట్లాడుతూ .. "కన్నడ నుంచి నాకు ఎక్కువ అవకాశాలు వస్తున్నప్పటికీ, మొదటి నుంచి కూడా తెలుగు పట్ల నేను ఆసక్తిని చూపిస్తూ వచ్చాను. అందుకు కారణం మా అమ్మగారేనని చెప్పాలి. ఇక ఈవీవీ గారు .. ఎస్వీ కృష్ణారెడ్డిగారు మంచి పాత్రలనిచ్చి నన్ను ప్రోత్సహించారు. కృష్ణగారి సినిమాలు ఎక్కువగా చేసే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తుంటాను" అని అన్నారు. 

"చాలా సినిమాల్లో అవకాశాలు నా వరకూ వచ్చి చేజారిపోయేవి. 'మేజర్ చంద్రకాంత్'లో ఎన్టీఆర్ కూతురుగా .. 'అల్లుడా మజాకా' సినిమాలో ఊహ చేసిన పాత్రను నేను చేయవలసింది. ఆ ఛాన్స్ మిస్సవ్వడం కూడా చాలా బాధను కలిగించింది. అలా అవకాశాలు వచ్చి పోవడానికి కారణం ఏమిటనేది కూడా నాకు తెలిసేది కాదు. ఇక చేసిన సినిమాలకి సంబంధించి నాకు డబ్బులు ఇచ్చినవారికంటే ఎగ్గొట్టినవారే ఎక్కువ" అని చెప్పారు.

More Telugu News