Devineni Uma: ఎంపీ పదవి కోసం ఇంతగా దిగజారాలా నానీ?: దేవినేని ఉమా

  • సీఎం జగన్ ను కలిసిన కేశినేని నాని
  • ప్రెస్ మీట్ లో చంద్రబాబుపై విమర్శలు
  • దుర్మార్గుడి పంచన చేరి దుర్భాషలాడతావా అంటూ ఉమా ఆగ్రహం
  • నీవెంట ఒక్క టీడీపీ కార్యకర్త కూడా రారని స్పష్టీకరణ 
Devineni Nani slams Kesineni Nani

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇవాళ సీఎం జగన్ ను కలిసిన అనంతరం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి కేశినేని నానీని తీవ్రంగా విమర్శించారు. రెండు సార్లు ఎంపీగా గెలిపించిన టీడీపీని, రాజకీయంగా పైకి తీసుకొచ్చిన చంద్రబాబుని కాదని దుర్మార్గుడి పంచన చేరి దుర్భాషలాడతావా? అంటూ మండిపడ్డారు. 

నాని తన ట్రావెల్స్ వ్యాపారం వదులుకోవడానికి కారణం నష్టాలు రావడం వల్లే... ఆ నష్టాలు  భర్తీ చేసుకోవడానికే ఆస్తులు అమ్ముకున్నాడు అని ఉమా స్పష్టం చేశారు. చంద్రబాబు పడుతున్న కష్టం చూసి తామంతా పార్టీ కోసం మౌనంగా అవమానాలు భరిస్తే, నాని మాత్రం ప్రోటోకాల్ పిచ్చితో ఇష్టానుసారం ప్రవర్తించాడని విమర్శించారు. 

లోకేశ్ పాదయాత్రతో యువతలో చైతన్యం వచ్చి నేడు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సభలకు యువత కదిలివస్తుంటే నానీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, దెబ్బతిన్న బెబ్బులిలా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలోనే తిరిగి, చివరకు కరకట్ట కమల్ హాసన్ ఓటమి భయంతో రాజీనామా చేసేలా చేశాడని అన్నారు. 


ఇప్పుడు జగన్ మంచివాడయ్యాడా?

నిన్నటి వరకు దుర్మార్గుడిలా కనిపించిన జగన్ రెడ్డి... ఇప్పుడు నానీకి సన్మార్గుడు అయ్యాడా?  దుర్మార్గుడితో ఉండాలనుకుంటే అది నానీ ఇష్టం.. కానీ అమరావతి రైతుల్ని, అమ్మలాంటి పార్టీని కించపరచడం ఏమిటి?  జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబుని, లోకేశ్ ని దుర్భాషలాడటం ఏమిటి? 

2019 ఎన్నికల్లో నానీ గెలుపుకోసం విజయవాడ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ అభ్యర్థులతో పాటు, పార్టీనే డబ్బు ఖర్చుపెట్టింది తప్ప, నానీ రూపాయి పెట్టలేదు. టీడీపీ కార్యకర్తల స్వేదం.. రెక్కల కష్టం వల్లే నాకైనా... నానీకైనా పదవులు దక్కాయి. నానీ గానీ, నేను గానీ మా చర్మం వలిచి చెప్పులు కుట్టించి టీడీపీకి ఇచ్చినా ఆ రుణం తీరదు. 

సీటు రాదనే పార్టీ మార్చాడు

కేవలం తనకు సీటు రాదన్న అభద్రతా  భావంతోనే నాని పార్టీ మార్చాడు. ప్రజలిచ్చిన అధికారంతో ల్యాండ్, శాండ్, వైన్, మైన్, సెంటు పట్టాలు, ఇతర కుంభకోణాల్లో రూ.2.50 లక్షల కోట్లు దోపిడీ చేసిన ఒక అవినీతి పరుడి పక్కన చేరిన కేశినేని నాని... చంద్రబాబునాయుడు, లోకేశ్ లపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఎంపీ పదవి కోసం ఇంతగా దిగజారాలా అని నానీని ప్రశ్నిస్తున్నా. 

నిన్నటి వరకు ఆహా, ఓహో అన్న నోటికి ఇప్పుడు మేం చెడ్డవాళ్లమైపోయామా? ఎంతమంది టీడీపీ కార్యకర్తల రెక్కల కష్టంతో తాను రెండుసార్లు ఎంపీగా గెలిచాడో నాని మర్చిపోయినా... మా పార్టీ మర్చిపోలేదు. గతంలో ప్రజారాజ్యం పార్టీని ఏ విధంగా నాని విమర్శించాడో తెలుసు. 

ఇతరుల మీద పడి ఏడిస్తే ఎలా?

చంద్రబాబు గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు నాని ఆయన్ని కలిశారు. అప్పుడు ఆయన నానీకి విజయవాడ ఎంపీగా అవకాశమిచ్చారు. చంద్రబాబు తన ఆలోచనల్ని అమలు చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం తనకు నచ్చిన నాయకులతో ఆ పనులు చేయిస్తాడు. దానికే ఇతరులపై పడి నానీ ఏడిస్తే ఎలా? “దేశంలో నిజాయితీ ఉన్న  అతికొద్ది మంది నాయకుల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒకరు” అని కేశినేని నాని 2023 సెప్టెంబర్8న అన్నారు. అదే చంద్రబాబు ఇప్పుడు పచ్చి మోసగాడు అయ్యాడా? అప్పటికీ ఇప్పటికీ ఇంతగా దిగజారాలా నానీ? ఇంతలో ఏమైందో సమాధానం చెప్పు. 

గత కొన్ని సంవత్సరాలుగా నానీ టీడీపీలో ఉంటూ సొంతపార్టీ  నాయకుల్ని నోటికొచ్చినట్టు తిట్టింది నిజం కాదా? అన్నింటికంటే ముఖ్యంగా చంద్రబాబునాయుడు జైలు నుంచి వచ్చాక కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన సందర్భంలో, అహంకారంతో నానీ మాట్లాడిన మాటలకు సాక్షాత్తూ ఆ తల్లి కనకదుర్గమ్మే నేడు ఆయన పతనానికి దారిచూపింది. 

ఆ సమయంలో నాని బయటికి రాలేదు

వైసీపీ గూండాలు గతంలో చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చినప్పుడు, మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు నాని బయటకు రాలేదు. మాట మాత్రంగా కూడా స్పందించలేదు. ఒంగోలు మహానాడుకి లక్షలాదిగా పార్టీ కార్యకర్తలు తరలివస్తే, నాని ఢిల్లీ వెళ్లిపోయాడు. 

రాజమహేంద్రవరంలో మహానాడు జరిగినప్పుడు కూడా ఢిల్లీలో కూర్చున్నాడు. ఈనాడు ఎంపీ హోదాలో నానీ అనుభవిస్తున్న ప్రొటోకాల్, ఇతర భోగాలన్నీ టీడీపీ కార్యకర్తల కష్టం వల్ల వచ్చినవేనని నాని గుర్తించాలి. నేను నాలుగుసార్లు గెలిచినా అది కార్యకర్తల వల్లే. చంద్రబాబు ఇచ్చిన బీఫామ్, ఆయన నాయకత్వం వల్లే మనం నాయకులం అయ్యాం. 

ఇప్పుడదే వ్యక్తి కారులో తాడేపల్లి కొంపకు వెళ్లాడు

నాడు కొబ్బరి చిప్పల మంత్రి అవినీతిపరుడని చెప్పిన నానీ, నేడు అదే వ్యక్తి కారులో తాడేపల్లి కొంపకు వెళ్లాడు. 2019లో జరిగిన ఎన్నికల్లో నానీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో లాలూచీ పడి, టీడీపీకి అన్యాయం చేశాడు. నందిగామలో వసూల్ బ్రదర్స్, వెయ్యికోట్లు దోపిడీచేసిన వసంత కృష్ణప్రసాద్ నానీకి మంచివాళ్లా? వన్ టౌన్ లో కొబ్బరి చిప్పల మంత్రి అవినీతిపరుడని చెప్పిన నానీ, నేడు అదే వ్యక్తి కారులో తాడేపల్లి కొంపకు పోయి, బయటకు వచ్చి చిలుకపలుకులు పలికాడు. 

నీ వెంట ఒక్క టీడీపీ కార్యకర్త కూడా రారు

తిరువూరు టీడీపీ ఇన్ ఛార్జ్ ను తిట్టి.... అక్కడి నాయకులు, కార్యకర్తలు జైళ్ల పాలు అయ్యేలా చేసింది నానీ అహంకారం కాదా? గెలుపువల్ల వచ్చిన అహం కారం బలుపుతో నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడటం నానీకి మంచిది కాదు. నిజంగా నానీ చెప్పాలనుకుంటే తాను విజయవాడకు చేసింది ఏమైనా ఉంటే చెప్పుకోవాలి. కానీ ఇలా బరితెగించి మాట్లాడితే చూస్తూ ఊరుకోం. టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఒక్కరు కూడా నానీ వెంట వెళ్లరు” అని దేవినేని ఉమా తేల్చిచెప్పారు.

More Telugu News