Kesineni Nani: జగన్ నాకు బాగా నచ్చారు... వైసీపీలో చేరుతున్నా: కేశినేని నాని

  • ఇవాళ సీఎం జగన్ ను కలిసిన ఎంపీ కేశినేని నాని
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో సుదీర్ఘ చర్చ
  • అనంతరం ప్రెస్ మీట్ 
  • తనకు ఎదురైన అవమానాలను వెల్లడించిన కేశినేని
  • చంద్రబాబు పచ్చి మోసగాడు అంటూ వ్యాఖ్యలు
Kesineni Nani set to join YCP

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇవాళ తాడేపల్లి వచ్చి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. సీఎంతో సమావేశం అనంతరం కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. 

"4వ తేదీ నుంచి జరుగుతున్న పరిణామాలు ఏంటో అందరికీ తెలుసు. లోక్ సభకు రాజీనామా చేసి, ఆ తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పాను. నేను 2013 జనవరి 16వ తేదీ నుంచి విజయవాడ పార్లమెంటు స్థానం ఇన్చార్జిగా, అభ్యర్థిగా టీడీపీ కోసం కష్టపడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పార్టీ కోసం కష్టపడిన తీరు మీ అందరికీ తెలుసు. 

సాధారణ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాధ్యత అంతా నా భుజాలపై వేసుకుని పనిచేశాను. పార్టీ తరఫున చావులైనా నేనే చేశాను... దినాలైనా నేనే చేశాను. నా సొంత వ్యాపార సంస్థ కంటే పార్టీయే ముఖ్యమని భావించి టీడీపీ కోసం కృషి చేశాను. 2012లో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. అప్పుడందరూ... ఎందుకు డబ్బు వృథా చేసుకుంటున్నావు, టైమ్ వేస్ట్ చేసుకుంటున్నావు అన్నారు. 

ఈ పార్టీ (టీడీపీ) గెలిచేది లేదు, ఎందుకు ఈ చంద్రబాబును నమ్ముతావు అని ఆ సమయంలో మా సామాజిక వర్గం వారే నన్ను మందలించారు. ఒక లక్ష్యంతో వచ్చాను... ఆయనను గెలిపించుకోవడమే నా లక్ష్యం అని భావించి శ్రమించాను. జడ్పీటీసీ గెలిచాం, ఎంపీటీసీ గెలిచాం... కృష్ణా జిల్లాలో అన్నీ గెలిచాం. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నాదే. ఆ తర్వాత నాకు టికెట్ ఇవ్వలేదు. కానీ ప్రజాగ్రహానికి తలొగ్గి, ఎంతో రగడ జరిగిన తర్వాత నాకు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రజల కోసం, పార్టీ కోసమే బతికాను. 

ఆస్తులు అమ్ముకున్నాను, వ్యాపారాలు మానుకున్నాను..

మీ అందరికీ తెలుసు... నేను ఆస్తులు అమ్ముకున్నాను, వ్యాపారాలు మానుకున్నాను. ఆరోజు నేను అమ్ముకున్న ఆస్తుల విలువ ఇవాళ హైదరాబాదులో అక్షరాలా రూ.2 వేల కోట్లు. నా ఎన్నికల అఫిడవిట్ చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. కొన్ని విషయాల్లో ఆయన (చంద్రబాబు) నా పట్ల వ్యవహరించిన తీరు వల్ల వ్యాపారం ఆపుకోవాల్సి వచ్చింది. ఆ రోజు కూడా నేనేమీ బాధపడలేదు. వాట్ నెక్ట్స్ అనుకుని ముందుకెళ్లాను. 

ఆ తర్వాత  2019 ఎన్నికల్లో మళ్లీ గెలిచాను. ఇక్కడ మంగళగిరిలో లోకేశ్ ఓడిపోతే, విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను. పార్టీ యంత్రాంగం మొత్తం లోకేశ్ కోసం పనిచేసినా ఆయన ఓడిపోయారు. చంద్రబాబు వద్ద నుంచి ఎప్పుడూ రూపాయి తీసుకోకుండానే నేను గెలిచాను. ఆ తర్వాత జరిగిన పరిణామాలను మీరందరూ చూశారు. 

ఎవరికీ చెప్పని ఒక నిజం ఇప్పుడు చెబుతున్నా..

ఆయన తన మనుషులను పెట్టి అనేక రకాలుగా నన్ను అవమానించారు. ఇవాళ వరకు ఎవరికీ చెప్పని ఒక నిజం ఇప్పుడు చెబుతున్నా. విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో ఆయన నాతో మాట్లాడారు. మేయర్ అభ్యర్థిగా ఎవర్ని పెడుతున్నారు అని నన్ను అడిగారు. నేను ఢిల్లీలో ఉన్నాను సార్... ఆ విషయం నాకు తెలియదు, ఇన్చార్జి చూసుకుంటున్నాడు అని చెప్పాను. 

బొండా ఉమ గారి వైఫ్ ను పెడుతున్నారట కదా... నిజమేనా? అని నన్ను ఫోన్ లో అడిగారు. ఆ విషయం నాకు తెలియదండీ అని చెప్పాను. లేదు లేదు... అలా జరిగితే చాలా ప్రమాదకరం... ముందు మీ కుటుంబంలో ఎవర్నైనా నిలబెట్టు అని చెప్పారు. మా వాళ్లకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదండీ అని బదులిచ్చాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. మూడ్రోజులు నన్ను బలవంతపెట్టారు. 

అప్పుడు మా అమ్మాయి శ్వేత టాటా ట్రస్ట్ లో పనిచేస్తోంది. శ్వేతను ఈ విషయం అడిగితే... నాకు ఆసక్తి లేదు డాడీ అని సమాధానం చెప్పింది. చంద్రబాబు గారు ఇలా చెప్పారమ్మా... పార్టీ కోసం మనం చేయాలి అని చెబితే... మూడ్రోజులు ఆలోచించుకుని టాటా ట్రస్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసి, విజయవాడ రాజకీయ బరిలో దిగింది. తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మళ్లీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించారు. 

నన్ను చెప్పుతీసుకుని కొడతానన్నా భరించాను

ఎన్నికలకు రెండ్రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టించి నన్ను ఒక వ్యక్తితో కేశినేని నానీని చెప్పుతో కొడతా అనిపించారు. ఇదేంటని అడిగితే పార్టీ నుంచి స్పందన లేదు. అదే ప్రెస్ మీట్ లో ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు ఈ ఎంపీ ఒక గొట్టంగాడు అన్నారు... అయినా పార్టీ నుంచి స్పందన లేదు. ఈ ప్రెస్ మీట్ వల్ల విజయవాడలో పార్టీ చెల్లాచెదురైపోయింది. 

ఆ తర్వాత చంద్రబాబు ప్రచారానికి వచ్చి... నువ్వు నాతో ప్రచారానికి రావొద్దు, నువ్వు వస్తే వాళ్లిద్దరూ రాబోమని చెబుతున్నారు అని నాతో అన్నారు. ఓకే సార్... అలాగే వెళ్లండి అని చెప్పాను. కార్పొరేషన్ ఎలక్షన్స్ లో, నా కూతుర్ని అభ్యర్థిగా నిలబెట్టుకుని, నా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే... నేను లేకుండా ప్రచారం చేశారు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదు. 

నన్ను చెప్పుతీసుకుని కొడతానన్నా గానీ భరించాను. గొట్టంగాడు అనిపించారు భరించాను... రోజూ ఇంకెన్ని అవమానాలు పడాలి? ఓసారి ఆయనను వెళ్లి అడిగాను... మీకు ఇష్టం లేకపోతే చెప్పండి సార్... తప్పుకుంటాను అన్నాను. లేదు లేదు నువ్వే ఉండాలి అన్నారు. ఈ విషయం బయట ఎక్కడా చెప్పవద్దు అన్నారు. రేపు జగ్గయ్యపేట సభకు కూడా నువ్వు వస్తేనే విజయవంతం అవుతుందన్నారు. 

సార్.. ఇన్చార్జిగా నన్ను తప్పించండి... వీళ్లతో కలిసి నేను పనిచేయలేకుండా ఉన్నాను అని మరోసారి ఆయనకు చెప్పాను. ఆ విషయం అంతటితో అయిపోయింది. 

ఆరు స్థానాల్లో ఎప్పుడూ కమ్మ అభ్యర్థులే

ఇవాళ ఎవరో నా కుటుంబ సభ్యుడు (కేశినేని చిన్ని) ఒకరికి ఎంపీ సీటు ఇవ్వాలంటున్నారు. ఇవ్వొచ్చు... అందులో తప్పులేదు. రాష్ట్రంలో ఆరు స్థానాల్లో ఎప్పుడూ కమ్మ అభ్యర్థులే పోటీ చేస్తుంటారు. విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట ఉన్నాయి. విశాఖలో భరత్ ఉన్నాడు... వాళ్ల కుటుంబ సభ్యుడు కాబట్టి ఓకే... మురళీమోహన్ ఖాళీ చేసిన రాజమండ్రి సీటు ఉంది, ఏలూరు సీటు ఉంది, ఇటు గుంటూరు నుంచి గల్లా గారు పోటీ చేయనని అంటున్నారు... అటు పక్క నరసరావుపేటలో అభ్యర్థి లేరు... అక్కడ ఇవ్వొచ్చు కదా! 

కానీ ఇక్కడికి తీసుకువచ్చి... ఇతనే ఎంపీ అభ్యర్థి అంటూ ఇన్చార్జిలందరికీ చెబుతున్నారు. ఎంపీగా ఉన్న నాకు చెప్పకుండా ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారు. నేను ఎక్కడికైనా వెళితే వాళ్లు పాల్గొనకుండా, అతను వెళితే వాళ్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. 

తిరువూరు సభ గురించి అందరికీ తెలుసు. ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణ గారిని నా వద్దకు పంపించారు. తిరువూరు సభ బాధ్యతలు నేను అతనికి  (చిన్నికి) అప్పగించాను కదా... ఈ సభ విషయంలో కేశినేని నాని అన్న ఎందుకు జోక్యం చేసుకున్నాడు అని లోకేశ్ అడిగినట్టు వారు నాకు చెప్పారు. దాంతో నేను, నాకేమీ అధికారిక సమాచారం లేదు కదా, మీ ముగ్గురిలో ఎవరైనా సమాచారం అందించారా అని ప్రశ్నించాను. టెలికాన్ఫరెన్స్ లో అచ్చెన్నాయుడు చెప్పారు కదా అని వారు చెప్పారు. నేను ఏ రోజూ టెలికాన్ఫరెన్స్ లో లేను, జూమ్ కాన్ఫరెన్స్ లో ఉండను... అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం. చంద్రబాబు వచ్చే సభ కాబట్టి నేను రాకుండా ఎలా ఉంటాను అని చెప్పాను. 

రౌడీ మూకలతో నన్ను కొట్టించాలని చూశారు

ఆ తర్వాత సభ సన్నాహక కార్యక్రమాలకు మీరు రావాలంటే వెళ్లాను... ఆ రోజు కూడా రౌడీ మూకలతో నన్ను కొట్టించాలని చూశారు. మా వాళ్లందరూ అడ్డుపడి నన్ను రక్షించుకున్నారు. పోలీసులు కూడా మాకు సాయపడ్డారు. ఇలా మా కుటుంబంలో చిచ్చు పెట్టి, మా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని లోకేశ్ ఎందుకు అనుకున్నారో నాకు అర్థంకాలేదు. నేనేమీ పార్టీ పట్ల ద్రోహం చేయలేదు, గత తొమ్మిదేళ్లలో ఒక్క తప్పు కూడా చేయలేదు. 

చంద్రబాబు మోసగాడు అని ఈ ప్రపంచానికి తెలుసు... పచ్చి మోసాలు చేస్తూ ఇలా కుటుంబాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదు. ఎంపీ పదవికి రాజీనామాను ఇవాళ మెయిల్ లో లోక్ సభ స్పీకర్ కు పంపిస్తాను. పార్టీకి రాజీనామా లేఖ పంపిస్తాను. 

ఈ జగన్ పేదల పక్షపాతి

ఇవాళ మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలిశాను. గతంలో సీఎం విజయవాడలో అనేక కార్యక్రమాలకు వచ్చినా నేను హాజరు కాలేదు. ఓ ఎంపీగా నేను హాజరు కావాలి... కానీ పార్టీ వద్దనడంతో హాజరు కాలేకపోయాను. ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్ భవన్ లో సీఎంను కలిసి విష్ చేశాను. ఇంతవరకు ఆయనతో నేరుగా మాట్లాడింది గానీ, ఫోన్ చేసింది గానీ లేదు. ఇవాళ మాత్రం ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించారు. కలిసి పనిచేద్దామని చెప్పారు. 

ఇప్పుడు నేను పార్టీ నుంచి తప్పుకున్నాను కాబట్టి నేను స్వేచ్ఛాజీవిని. నాకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటా. ఒకటైతే గ్యారంటీ... చంద్రబాబు అనే వ్యక్తి పచ్చి మోసగాడు. దాంట్లో సందేహమే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. అతడు దేవుడు అని జనం అనుకుంటారో, మీడియా అనుకుంటుందో, కులపరంగా అనుకుంటారో నాకు తెలియదు. కానీ ఈ జగన్ అయితే పేదల పక్షపాతి. 

అభివృద్ధి అంటారా... కొవిడ్ వల్ల కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు. కొవిడ్ తో అప్పుడు భారతదేశమే ఇబ్బంది పడింది. ప్రజలను సంతోషంగా ఉంచేందుకు జగన్ దాదాపు రూ.2 లక్షల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేశారు. ప్రజల కోసం ఇంకా కమిట్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారాయన. జగన్ నాకు చాలా బాగా నచ్చారు. ఆయన చేపడుతున్న పథకాలు చూస్తున్నాం, వింటున్నాం. ఆయనతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. నా రాజీనామా ఆమోదం పొందగానే వైసీపీలో చేరతాను" అంటూ తన మనసులో ఉన్న మాటలు వెల్లడించారు.

More Telugu News