Peddireddi Ramachandra Reddy: అందుకే చంద్రబాబు రెండో స్థానం చూసుకుంటున్నారు: మంత్రి పెద్దిరెడ్డి

  • వైసీపీలో ఒక స్థానం కోసం 20 మంది పోటీ పడుతున్నారన్న పెద్దిరెడ్డి
  • సహజంగానే గందరగోళం ఏర్పడుతుందని వెల్లడి
  • ఇదేమంత పెద్ద సమస్య కాదని వ్యాఖ్యలు
Peddireddy comments on Chandrababu and Pawan Kalyan

రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి హిందూపురంతో పాటు, టీడీపీ అగ్రనేతలు పోటీ చేసే పలు చోట్ల వైసీపీనే గెలుస్తుందని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ టీడీపీలో పెద్ద నేతలు అని, సహజంగానే వారి నియోజకవర్గాలపై తాము ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. కుప్పంలోనూ వైసీపీ విజయభేరి మోగిస్తుందని చెప్పారు.

వైసీపీ గెలిచే పార్టీ అని, అందువల్లే తమ పార్టీలో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉందని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. టీడీపీకి అభ్యర్థులు లేకపోవడం వల్లే చంద్రబాబు తమ పార్టీ నుంచి నేతలను తీసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు రెండో స్థానం చూసుకుంటుండడానికి కూడా కారణం ఇదేనని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. 

"చంద్రబాబుకు అభ్యర్థులు ఉంటే ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఏమిటి మీ అజెండా? మధ్యలో పవన్ కల్యాణ్ వచ్చాడు... ఆయన పోటీ చేస్తాడని తెలుసు తప్ప, ఆయన పార్టీలో ఎవరు పోటీ చేస్తారో స్పష్టత లేదు. పవన్ పార్టీకి కూడా అభ్యర్థులు లేరు. మీ పరిస్థితి అది! మా పరిస్థితి చూస్తే... ఒక స్థానానికి 20 మంది టికెట్లు అడుగుతున్నారు. వైసీపీ గెలుస్తుంది, జగన్ పై నమ్మకం ఉంది కాబట్టే మా పార్టీలో టికెట్ల కోసం ఈ స్థాయిలో పోటీ ఉంది. 

జగన్ చెప్పిన మాట చేస్తాడు... ప్రజల్లో ఆయనపై నమ్మకం ఉంది కాబట్టే ప్రతి ఒక్కరూ మా పార్టీ తరఫున పోటీ చేయాలని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు టికెట్ల అంశంలో కొంచెం గందరగోళం చోటు చేసుకోవడం సహజమే. ఇలాంటివన్నీ మేం అధిగమిస్తాం... అదేమంత సమస్య కాదు" అని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

More Telugu News