sajjanar: ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదు: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక

TSRTC MD Sajjanar warns over attacks on rtc employees
  • ఆందోల్‌లో హైర్ బస్ డ్రైవర్‌పై దాడికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్
  • బైకర్ నిర్లక్ష్యంగా నడిపి... డ్రైవర్‌పై దాడి చేశారని ఆగ్రహం
  • మహాలక్ష్మి పథకం తర్వాత సిబ్బందిపై ఒత్తిడి పెరిగిందన్న సజ్జనార్

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం ఓ బైకర్... ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనకు సంబంధించి సజ్జనార్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

'నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం సమంజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి.

సంగారెడ్డి జిల్లా ఆందోల్‌‌లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిందీ సంఘటన (ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు). బైకర్‌ నిర్లక్ష్యంగా నడపి ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి టీఎస్ఆర్టీసీ హైర్‌ బస్‌ డ్రైవర్‌పై దాడి చేశారు. దుర్భాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారు.

ఇలాంటి దాడులను యాజమాన్యం అసలు సహించదు. ఈ ఘటనపై ఆందోల్‌ పోలీస్‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి... పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది' అని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News