Cricketer: క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి.. పక్కనే జరుగుతున్న మరో మ్యాచ్‌ బాల్‌ వచ్చి తగలడంతో విషాదం

A man died while playing cricket in Mumbai as next match ball hit him
  • తలకు బంతి తగిలి ప్రాణాలు కోల్పోయిన 52 ఏళ్ల వ్యక్తి 
  • ముంబైలో జరిగిన విషాదకర ఘటన
  • పక్కపక్క పిచ్‌లపై మ్యాచ్‌లు జరుగుతుండగా ఘటన
  • బంతి వెనుక నుంచి రావడంతో గమనించలేకపోయిన క్రికెటర్
మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ మ్యాచ్ ఆడుతూ 52 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. పక్కనే జరుగుతున్న మరో మ్యాచ్ బాల్ వచ్చి తలకు బలంగా తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. మాతుంగాలోని దాడ్కర్ మైదాన్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ వైపు తిరిగి ఫీల్డింగ్ చేస్తుండగా బంతి వెనుక నుంచి వచ్చి అతని తలకు బలంగా తగిలిందని, హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని ఒక ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నాడు. 

కాగా 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తుల కోసం ‘కుచ్చి వీసా ఓస్వాల్ వికాస్ లెజెండ్ కప్’ పేరిట ముంబైలో టీ20 టోర్నమెంట్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం రెండు మ్యాచ్‌లు పక్కపక్క పిచ్‌లపై నిర్వహించారు. సమయం ఎక్కువ లేకపోవడం, వేరే మైదానాలు అందుబాటులో లేకపోవడంతో ఈ విధంగా పక్కపక్కనే ఒకేసారి నిర్వహించాల్సి వచ్చింది. ఎక్కువ మ్యాచ్‌లు ఆడించాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం విషాదకరంగా మారింది.

ప్రమాదవశాత్తూ క్రికెటర్ మృతి చెందినట్లుగా రిపోర్ట్ తయారు చేశామని పోలీసులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా బంతితో కొట్టలేదని నిర్ధారించేందుకు పోస్టుమార్టం చేయాలని ఆదేశించామని, కానీ రిపోర్టులో అలాంటి ఆధారాలు ఏవీ గుర్తించలేదని వెల్లడించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు.
Cricketer
Mumbai
Died
Cricket

More Telugu News