Mystery Deaths: రాత్రి నిద్రించిన ఏడుగురిలో తెల్లారేసరికి ఐదుగురి ఊపిరి ఆగింది.. యూపీలో మిస్టరీ ఘటన!

7 Members Of A Family Went To Sleep And 5 Were Found Dead Next Day In UP
  • కుటుంబంలో మరో ఇద్దరి పరిస్థితి విషమం
  • ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో అనుమానించిన ఇరుగు పొరుగు
  • బలవంతంగా డోర్లు తెరిచి లోపలికి వెళ్లి చూస్తే షాక్
  • యూపీలోని అమ్రోహా జిల్లాలో ఘోరం.. మృతులంతా చిన్నారులే
రాత్రిపూట భోజనం చేసి నిద్రించిన కుటుంబంలో.. తెల్లారేసరికి ఐదుగురు చిన్నారులు విగతజీవులుగా మారారు. మిగతా ఇద్దరు పెద్దవారు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వారి ఇంట్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించిన ఆనవాళ్లు కానీ, కుటుంబంలో గొడవ జరిగిన సూచనలు కానీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన.

సోమవారం రాత్రి మూసుకున్న ఇంటి తలుపులు మంగళవారం సాయంత్రం కావొస్తున్నా తెరుచుకోకపోవడంతో ఇరుగు పొరుగు వారు అనుమానించారు. బలవంతంగా డోర్లు తెరిచి లోపలికి వెళ్లి చూడగా.. కుటుంబం మొత్తం నిద్రలోనే ఉన్నారు. అందులో ఐదుగురు పిల్లలు అప్పటికే చనిపోయినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఒకే కుటుంబంలో ఐదుగురు చనిపోయిన విషయం తెలిసి పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

ప్రాణాలతో ఉన్న ఇద్దరు పెద్దవాళ్లను హుటాహుటిన ఆసుపత్రికి, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు. కాగా, ఈ ప్రమాదం జరిగిన ఇంటి యజమాని పేరు రహీజుద్దీన్ అని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు రహీజుద్దీన్ సంతానం కాగా మిగతా ఇద్దరు బంధువుల పిల్లలని చెప్పారు. ఈ ఘటనలో రహీజుద్దీన్ భార్యతో పాటు అతడి తమ్ముడు చావుబతుకుల్లో ఉన్నారని వివరించారు.

ఇంట్లో వెచ్చదనం కోసం పెట్టుకున్న కుంపటి వల్లే పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. గదిలోకి గాలి వచ్చే మార్గం లేకపోవడం, కుంపటి నుంచి వెలువడిన కార్బన్ డయాక్సైడ్ కారణంగా గాలిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గి ఉండొచ్చని అంటున్నారు. దీంతో ఊపిరి ఆడక వారు నిద్రలోనే కన్నుమూశారని పోలీసులు చెబుతున్నారు.
Mystery Deaths
UP Family
Amroha District
Five Dead in Sleep
Uttar Pradesh

More Telugu News